Share News

రోడ్‌షోతో మోదీ సుడిగాలి ప్రచారం

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:32 PM

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు ప్రచారం సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తోంది. బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చివరినిమిషంలో సుడిగాలి ప్రచారం సాగించారు.

రోడ్‌షోతో మోదీ సుడిగాలి ప్రచారం
PM Modi

బరాక్‌పూర్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు ప్రచారం సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తోంది. బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చివరినిమిషంలో సుడిగాలి ప్రచారం సాగించారు. వరుస ర్యాలీలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు. చివరిరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా బరాక్‌పూర్‌లో జరిగిన భారీ రోడ్‌షోలో ప్రధాని పాల్గొన్నారు. దీనికి ముందు విజయ్ సంకల్ప ర్యాలీకి హాజరై పశ్చిమబెంగాల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మే 4న ఫలితాలు వెలువడిన అనంతరం ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయనుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి తిరిగి వస్తానని చెప్పారు.


ప్రధానమంత్రి పలు ప్రచార సభల్లో పశ్చిమబెంగాల్‌ తన వ్యక్తిగత, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంత కీలకంగా నిలిచిందో వివరించారు. బెంగాల్ తన అధ్యాత్మిక జీవితానికి శక్తి కేంద్రమని, బెంగాల్‌ గడ్డపై పుట్టిన ఎందరో గొప్ప వ్యక్తులనుంచి స్ఫూర్తి పొందానని, ప్రజల అభిమానాన్ని ఎన్నటికీ మరిచిపోలేనని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల మనోగతాన్ని గ్రహించానని, ఇప్పుడు వెళ్లి తిరిగి మే 4న ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ప్రమాణస్వీకారానికి వస్తానని చెప్పారు.


'గత మూడు నాలుగు దశాబ్దాలుగా దేశం నలుమూలలా తిరిగాను. రాజకీయాల్లో అడుగుపెట్టి బీజేపీలో చేరిన తర్వాత పార్టీ కార్యకర్తగా పనిచేశా. ఎన్నికల విధులతో పాటు పార్టీ అప్పగించిన ఏ పనైనా చేస్తూ వచ్చా. రాత్రి, పగలు అని కానీ, వాతావరణాన్ని కానీ పట్టించుకోకుండా ముందుకు ప్రయాణం సాగిస్తూనే వచ్చాను. ఇల్లు విడిచిపెట్టినప్పటి నుంచి ప్రజలతో మమేకం కావడం ఎంతో సౌకర్యంగా, ప్రశాంతంగా ఉంది. మీరంతా నా కుటుంబం' అని మోదీ తన ప్రసంగాల్లో పేర్కొన్నారు.


రికార్డు స్థాయి ఓటింగ్

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈనెల 23న ముగిసింది. రికార్డు స్థాయిలో 91.78 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రెండో విడత పోలింగ్ ఈనెల 29న జరుగనుంది. దీంతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

ఇప్పుడు వెళ్తున్నా.. మళ్లీ ఆరోజు తిరిగి వస్తా

మా-మాటి-మనుష్ విజయం ఖాయం: మమత

Updated Date - Apr 27 , 2026 | 05:53 PM