మలుపు తిరిగిన కార్తీక దీపం వివాదం.. ఆలయ ప్రకటనతో సంబంధం లేదన్న పూజారులు
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:41 PM
మదురై తిరుపరంకుండ్రం కార్తీక దీపం వివాదంలో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని వంశపారంపర్య పూజారులు స్పష్టం చేశారు. తమను సంప్రదించకుండానే పేర్లను ఉపయోగించారని ఆరోపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మదురై తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వివాదం మరో ములుపు తిరిగింది. ఆలయ అధికారులు జారీ చేసిన ప్రకటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ.. తమను సంప్రదించకుండానే తమ పేర్లను వినియోగించారంటూ ఆలయ పూజారులు ఆరోపిస్తున్నారు.
దీపతూన్ వద్ద కార్తీక దీపం వెలిగించే విషయంలో.. డిప్యూటీ కమిషనర్, ఆలయ బోర్డు సభ్యులకు.. అధికారులు పేర్కొన్నట్లుగా.. తాము ఎలాంటి లేఖనూ పంపలేదని పూజారులు స్పష్టం చేశారు. నవంబరు 20న జారీ అయిన సుప్రీంకోర్టు ఆదేశాలపైన తాము ఎలాంటి అభిప్రాయాన్నీ ఆలయ అధికారులకు తెలియజేయలేదని వెల్లడించారు. మీడియా ద్వారానే ఈ విషయం తమకు తెలిసిందని పేర్కొన్నారు.
ఉచ్చిపిళ్లైయార్ ఆలయం వద్ద కార్తీకదీపం వెలిగించే అంశంపై ఆలయ అధికారులతో గతంలో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలకు.. ప్రస్తుత అంశానికి ఎలాంటి సంబంధం లేదని పూజారులు పేర్కొన్నారు. మతపరమైన పద్ధతులు, ఆగమ శాస్త్ర నియమాలతో పాటు ఆలయపూజారుల అభిప్రాయలను ఉదహరిస్తూ.. ఉచ్చిపిళ్లైయార్ వద్ద దీపాన్ని వెలిగించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదని, తాము ఎటువంటి అభిప్రాయాలను తెలియజేయలేదని ఆలయ పూజారులు పేర్కొనడం చర్చనీయాంశమైంది.