Share News

తెలుగు ఐపీఎస్‌లకు ప్రత్యేక గుర్తింపు

ABN , Publish Date - Sep 02 , 2026 | 05:47 AM

దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది పోలీస్‌ అధికారులను గుర్తిస్తూ ఫేమ్‌ ఇండియా-ఆసియా పోస్ట్‌ సంయుక్తంగా ఓ జాబితా విడుదల చేశాయి. దీనికి అదనంగా సూపర్‌ 5 విభాగాన్ని కూడా చేర్చారు.

తెలుగు ఐపీఎస్‌లకు ప్రత్యేక గుర్తింపు

  • ఫేమ్‌ ఇండియా-ఆసియా పోస్ట్‌

  • టాప్‌ 25లో గుండాలరెడ్డి రాఘవేంద్ర

  • సూపర్‌ 5 విభాగంలో అధిరాజ్‌ సింగ్‌ రాణా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది పోలీస్‌ అధికారులను గుర్తిస్తూ ఫేమ్‌ ఇండియా-ఆసియా పోస్ట్‌ సంయుక్తంగా ఓ జాబితా విడుదల చేశాయి. దీనికి అదనంగా సూపర్‌ 5 విభాగాన్ని కూడా చేర్చారు. వీటిలో తెలుగు ఐపీఎస్‌లకు చోటు దక్కింది. టాప్‌ 25 జాబితాలో ఒడిశాలోని ఝార్సుగూడ ఎస్పీ గుండాలరెడ్డి రాఘవేంద్ర ఉన్నారు. నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్స్‌, నేర నియంత్రణ, శాంతిభద్రతలు, టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌, సామాజిక కార్యక్రమాల్లో ఆయన ప్రతిభకు ఈ గౌరవం దక్కింది. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన 2019 బ్యాచ్‌ ఒడిశా క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి రాఘవేంద్ర.. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన నౌపడ ఎస్పీగా ఆయన పనిచేసినపుడు.. తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్‌ నిఘాను బలోపేతం చేశారు. పొరుగునే ఉన్న ఛత్తీస్‌గఢ్‌తో సమన్వయాన్ని నెలకొల్పి నక్సల్స్‌ దాడులను సమర్థంగా ఎదుర్కొన్నారు. దీనికిగాను కేంద్ర హోం శాఖ నుంచి మెడల్‌ కూడా దక్కింది. ఇప్పుడు ఝార్సుగూడ ఎస్పీగా పోలీసింగ్‌లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల బాధ్యత కోసం ఆటోలను, ట్యాక్సీలను క్యూఆర్‌ కోడ్‌తో గుర్తించేందుకు స్మార్ట్‌ ఆటో ట్రాకింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దేశంలోని టాప్‌ 25 ప్రముఖ పోలీసు అధికారుల జాబితాలో తనకు దక్కిన గుర్తింపును తోటి అధికారులు, సిబ్బందికి రాఘవేంద్ర అంకితం చేశారు. సూపర్‌ 5 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ, సైబర్‌ క్రైం ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా చోటు దక్కించుకున్నారు.

ఈ వార్తలను కూడా చదవండి

పోరంబోకులో ప్రహరీ తొలగింపు

సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని

Updated Date - Sep 02 , 2026 | 05:47 AM