Share News

రోడ్డు విస్తరణ పనుల్లో వివక్ష

ABN , Publish Date - Sep 01 , 2026 | 11:37 PM

సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్ల కూల్చివేతల్లో సైతం వివక్షత పాటిస్తున్నారు. ఉన్న వారికి ఒక తీరుగా లేని వారికి మరో తీరుగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రోడ్డు విస్తరణ పనుల్లో వివక్ష

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్ల కూల్చివేతల్లో సైతం వివక్షత పాటిస్తున్నారు. ఉన్న వారికి ఒక తీరుగా లేని వారికి మరో తీరుగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుల్తానాబాద్‌ పట్టణ సమగ్రాభివృద్ధి, సుందరీకరణ పనుల్లో భాగంగా ప్రధాన రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. పాత జెండా చౌరస్తా నుంచి చెరువు వరకు, గట్టేపల్లి రోడ్డు, ఎంపీడీవో ఆఫీసు చౌరస్తా వరకు పనులు చేపట్టి పూర్తి చేశారు. పూసాల చౌరస్తాలో రోడ్లు డివైడర్లు నిర్మించారు. మున్సిపల్‌ ఆఫీసు నుంచి వేణుగోపాలస్వామి ఆలయం లైబ్రరీ మీదుగా రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టారు. ఐబీ చౌరస్తా నుంచి మండల పరిషత్‌, నీరుకుళ్ల రోడ్డు మజీద్‌ వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశారు. ఇంకా మజీద్‌ నుంచి గట్టేపల్లి రోడ్డు చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. మొదట ఈ రోడ్డును ఆరవై ఫీట్ల రోడ్డుగా నిర్మించాలని అందుకు అనుగుణంగా రోడ్డుకు ఇరువైపులా ఇండ్లు కూల్చివేయాలని నిర్ణయించారు. అనంతరం అరవై ఫీట్ల నుంచి రోడ్డు నిర్మాణం పనులు 54 ఫీట్ల వరకు కుదించారు. ప్రస్తుతం ఆ 54 ఫీట్ల మేరకు కూడా కూల్చివేత పనులు కొనసాడం లేదు. ఈ రోడ్డులో ఉన్న పలుకుబడి వాళ్ళకు ఒక న్యాయం మిగితా వారికి మరో న్యాయం అనే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం విస్తరణ పనులు నిలిచిపోయాయి. పేద మధ్య తరగతి వారి నిర్మాణాలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కూల్చివేయించిన వారు పలుకుబడి ఉన్న వారి ఇండ్లు ఎందుకు కూల్చివేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. అరవై నుంచి 54 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి కుదించి మధ్యలో 54 ఫీట్లను ఎందుకు అమలు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. సుల్తానాబాద్‌ పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఎలాంటి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చూపించకపోవడం గమనార్హం, మజీద్‌ ఎదురుగా మూలమలుపు వద్ద ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వారి ఇండ్లు పూర్తిగా కూల్చివేయించారు. ప్రస్తుతం ఆ కుటుంబం రోడ్డున పడింది. వారికి ప్రత్యామ్నాయం చూపకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిదులు రోడ్డు విస్తరణ పనుల్లో ఎలాంటి వివక్షత లేకుండా కొనసాగించాలని, రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

గుంతల్లో నీరు నిలిచి దోమల బెడద

కూల్చివేతల మూలంగా గుంతలు ఏర్పడ్డాయి. వాటిల్లో వర్షఫు నీరు డ్రైనేజీల నీరు నిలిచిపోయి దోమలకు ఆవాసంగా మారాయి. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ఐదు డెంగ్యూ కేసులు వెలుగుచూశాయి. వీటి మూలంగా అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రాంతంలో మురుగునీటి కాలువలు సైతం మూసుకుపోవడంతో ఇండ్లలో నుంచి వచ్చిన మురుగు నీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Sep 01 , 2026 | 11:37 PM