నీట్ పరీక్షకు ముందు టెలిగ్రామ్‌పై నిషేధం.. మరి, వాట్సాప్‌ను ఎందుకు వదిలేశారు..
ABN , Publish Date - Jun 16 , 2026 | 05:02 PM
నీట్-యూజీ 2026 రీ-టెస్ట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరీక్షల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలు ఏమిటి..?
నీట్-యూజీ 2026 రీ-టెస్ట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరీక్షల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలు ఏమిటి? టెలిగ్రామ్ తరహాలోనే మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌పై ఎందుకు నిషేధం విధించలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి (Telegram Ban India).
టెలిగ్రామ్ తరహాలోనే వాట్సాప్ ద్వారా కూడా సమాచారం వేగంగా వ్యాపిస్తుంది. అయితే అధికారుల దృష్టిలో ప్రస్తుతం సమస్యకు కేంద్రంగా ఉన్నది టెలిగ్రామ్ ఛానెల్‌ల నెట్‌వర్క్. టెలిగ్రామ్‌లో పెద్ద సంఖ్యలో పబ్లిక్ ఛానెల్‌లు, అనామక అడ్మిన్ వ్యవస్థ, భారీ స్థాయిలో ఫైల్ షేరింగ్ సౌకర్యాలు ఉండటం వల్ల చీటింగ్ రాకెట్లకు అది సులభ వేదికగా మారింది (Telegram vs WhatsApp).
ఇటీవల నీట్ పరీక్షకు సంబంధించిన నకిలీ ప్రశ్నపత్రాలు, పేపర్ లీక్ ప్రచారాలు, మోసపూరిత సందేశాలు ప్రధానంగా టెలిగ్రామ్ ఛానెల్‌లు, గ్రూపుల ద్వారా వ్యాపించినట్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందాయి. లక్షలాది మంది సభ్యులతో కూడిన పబ్లిక్ ఛానెల్‌లు, అనామకంగా నిర్వహించే గ్రూపులు టెలిగ్రామ్‌లో విస్తృతంగా ఉండటంతో అక్రమ కార్యకలాపాలకు అది వేదికగా మారిందని అధికారులు భావిస్తున్నారు (NEET Re-Test 2026).

టెలిగ్రామ్‌లో సందేశాలను ఎడిట్ చేసే సౌకర్యం కూడా ప్రధాన ఆందోళనగా మారింది. పాత సందేశాలను సవరించి, అవి ముందుగానే పంపినట్లుగా చూపిస్తూ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయనే తప్పుడు ప్రచారాన్ని కొందరు చేసినట్లు విచారణలో తేలింది. ఇక, వాట్సాప్‌తో పోల్చుకుంటే టెలిగ్రామ్ వినియోగదారుల గోప్యతపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఎవరైనా టెలిగ్రామ్‌లో ప్రొఫైల్‌ను సృష్టించుకున్నప్పుడు, ఫోన్ నంబర్‌ను దాచి, కేవలం యూజర్‌నేమ్‌తోనే యాప్‌ను ఉపయోగించవచ్చు (Telegram Blocked in India).
ఒకసారి టెలిగ్రామ్‌లో ప్రొఫైల్ సృష్టించుకున్న తర్వాత, గుర్తింపును అజ్ఞాతంగా ఉంచుకుంటూ, అపరిమిత సంఖ్యలో సబ్‌స్ర్కైబర్‌లు ఉండే ఛానెల్‌ను సృష్టించడం చాలా సులభం. అంటే, ఒక బృందం తమ గుర్తింపును దాచుకుని, లక్షలాది మంది సబ్‌స్ర్కైబర్‌లతో ఒక ఛానెల్‌ను నడపగలదు. ఆ ఛానెల్ వెనుక ఎవరున్నారో గుర్తించడం చాలా కష్టం. వాట్సాప్‌లో అలాంటి సౌలభ్యం ఉండదు. ఇక ఫైల్ షేరింగ్ విషయంలో కూడా టెలిగ్రామ్ చాలా ఎక్కువ సౌకర్యాలను అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎలాంటి కంప్రెషన్ లేకుండా 2జీబీ ఫైళ్లను కూడా షేర్ చేయవచ్చు.
వినియోగదారులు వ్యక్తిగతంగా ఏమి పంచుకుంటున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో తాము చూడలేమని వాట్సాప్ చెబుతున్నప్పటికీ, అది ఏఐ టూల్స్‌ని ఉపయోగించి పబ్లిక్ గ్రూపులలో వినియోగదారుల ప్రవర్తనను పర్యవేక్షించగలదు. ఈ పర్యవేక్షణ కారణంగానే సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు వాట్సాప్ కాకుండా టెలిగ్రామ్ వైపు మొగ్గు చూపుతుంటారు.
ఇవి కూడా చదవండి..
నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..
సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..