Share News

రూ.5 వేల కోట్ల ప్రత్యేక సాయం చేయండి

ABN , Publish Date - May 21 , 2026 | 05:38 AM

తెలంగాణకు ఆర్థిక ఊతం అందించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. అలాగే, ‘బొగ్గు గ్యాసిఫికేషన్‌’ ప్రాజెక్టుకు,,,

రూ.5 వేల కోట్ల ప్రత్యేక సాయం చేయండి

తెలంగాణకు ఆర్థిక ఊతం అందించండి

విద్యారంగ అభివృద్ధికి రూ.30 వేల కోట్లతో ప్రణాళికలు

ఏడీబీ, ఏఐఐబీ రుణాలను ఎఫ్‌ఆర్బీఎంలోకి తేవొద్దు

బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ సిద్ధం

కేంద్ర మంత్రులు నిర్మల, కిషన్‌రెడ్డిలకు భట్టి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ఆర్థిక ఊతం అందించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. అలాగే, ‘బొగ్గు గ్యాసిఫికేషన్‌’ ప్రాజెక్టుకు సింగరేణి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి తెలిపారు. ఢిల్లీలో బుధవారం నిర్మలా సీతారామన్‌, కిషన్‌ రెడ్డిని ఆయన వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. తొలుత నిర్మలా సీతారామన్‌ను కలిసిన భట్టి.. పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో 105 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణానికి రూ.21,000 కోట్లు, డిగ్రీ, జూనియర్‌, సాంకేతిక కళాశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.9,000 కోట్లను వెచ్చిస్తున్నామని వివరించారు. ఏషియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) నుంచి రూ.4,049.11 కోట్ల రుణంతో యంగ్‌ ఇండియా గురుకులాలు, ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌(ఏఐఐబీ) నుంచి రూ.4,903.44 కోట్ల రుణంతో విద్యా మౌలిక సదుపాయాలను చేపడుతున్నామన్నారు.


ఈ రుణాలను ఎఫ్‌ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం ‘‘సాస్కీ’’ పథకం కింద మంజూరైన రూ.4,208 కోట్లకు అదనంగా మరో రూ.5 వేలకోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. కాగా, బొగ్గును కేవలం విద్యుత్‌ ఉత్పత్తికే కాకుండా, కోల్‌ ఇండియా తరహాలో ఆధునిక సాంకేతికతతో ‘బొగ్గు గ్యాసిఫికేషన్‌’ ప్రాజెక్టులుగా మార్చేందుకు సింగరేణి సిద్థంగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి భట్టి తెలిపారు. తద్వారా పారిశ్రామిక ఇంధన భద్రతతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఇందుకు కేంద్రం పాలసీపరమైన, సాంకేతిక సహకారం అందించాలని కోరారు. అలాగే, తెలంగాణ విద్యుత్‌ అవసరాలకు అత్యంత కీలకమైన కొయ్యగూడెం బ్లాక్‌ - 3 గతంలో వేలంలో కేటాయించినా.. నాలుగేళ్లుగా పనులు ప్రారంభం కాలేదని, దానిని వెంటనే సింగరేణికి అప్పగించేలా చొరవ చూపాలని కోరారు. తాడిచర్ల కోల్‌ బ్లాక్‌-2 మైనింగ్‌ లీజ్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ముందస్తు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులపై స్పందించిన కిషన్‌రెడ్డి.. సమస్యల పరిష్కారానికి త్వరలోనే కేంద్ర, రాష్ట్ర, సింగరేణి అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 21 , 2026 | 05:38 AM