Share News

పొత్తు నుంచి బయటకు రావడం సరైనదే..: ఎంపీ మాణికం ఠాగూర్

ABN , Publish Date - May 08 , 2026 | 01:42 PM

డీఎంకే, ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకోనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఎక్స్ వేదికగా స్పందించారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

పొత్తు నుంచి బయటకు రావడం సరైనదే..: ఎంపీ మాణికం ఠాగూర్
Tamil Nadu Politics

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ ఉత్కంఠ రేపుతున్నాయి. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ప్రశ్న దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో పొత్తుల కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇటీవల ముందుకొచ్చింది. ఈ మేరకు విజయ్‌తో కలిసి పని చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ తమతో పొత్తును తెంచుకోవడాన్ని డీఎంకే తీవ్రంగా తప్పుపట్టింది. ఈ అంశంలో స్టాలిన్ సహా ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.


మరోవైపు డీఎంకే, ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకోనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. శుభవార్త రాబోతోందని, పార్టీ కార్యకర్తలు ఐక్యంగా ఉండాలని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి చెప్పడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఎక్స్ వేదికగా స్పందించారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టామని.. డీఎంకేతో పొత్తు నుంచి బయటకు రావడం సరైన నిర్ణయమేనని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకుని, తమను తాము లౌకికవాదులమని చెప్పుకోలేదని మాణికం ఠాగూర్ పేర్కొన్నారు.


'రెండు ద్రావిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే జీవితకాల ప్రత్యర్థులుగా ఉన్నాయి. కానీ, రాత్రికి రాత్రే ఏకమయ్యాయి. లౌకికవాదం కోసం కాదు.. కేవలం ఒక్క వ్యక్తి (విజయ్)ని ఆపడానికి మాత్రమే. జరగబోయేది కాంగ్రెస్‌కు ముందే అర్థమైంది. అందుకే బయటకు వెళ్లిపోయింది. మీరు ఆర్ఎస్ఎస్, బీజేపీ బి-టీమ్‌తో పొత్తు పెట్టుకుని లౌకికవాదులమని చెప్పుకోలేరు. స్థిరమైన ప్రభుత్వమనేది అధికారాన్ని కాపాడుకోవడానికి భయపడుతున్న రెండు పార్టీలు వాడే రాజకీయ భాష మాత్రమే. డీఎంకేతో పొత్తు నుంచి కాంగ్రెస్ వైదొలగడం సరైనదే..?' అంటూ మాణికం ఠాగూర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అన్నాడీఎంకేతో డీఎంకే పొత్తు.. కనిమొళి ఏమన్నారంటే..

కాలం అనుకూలిస్తే రాజకీయాల్లోకి వస్తా..

Updated Date - May 08 , 2026 | 02:51 PM