తమిళనాడులో మళ్లీ ఎన్నికలు సాధ్యమేనా?
ABN , Publish Date - May 08 , 2026 | 12:47 PM
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సందిగ్ధం కొనసాగుతున్న వేళ తమిళనాడులో మళ్లీ ఎన్నికలు సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మరి ఈ విషయంలో రాజ్యంగం ఏం చెబుతోందంటే..
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాట 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు కోసం ఇంకా అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో సీట్ల పరంగా రెండు, మూడు స్థానాల్లో నిలిచిన డీఎంకే, అన్నాడీఎంకే జట్టు కట్టే అవకాశం ఉందన్న వార్తలు మరింత కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోతే తమ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారని టీవీకే వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు తమిళనాడులో మళ్లీ ఎన్నికలు జరుగుతాయా? అన్న ప్రశ్నపై చర్చ జరుగుతోంది.
ఎన్నికల తరువాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగంలో నిర్దిష్ట గడువు లేదు. అయితే, ఆనవాయితీ ప్రకారం, వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌లు పార్టీలను ఆహ్వానిస్తుంటారు. ఈ విషయంలో రాజ్యాంగ వ్యవస్థలు సహేతుకంగా ఉండాలని సుప్రీం కోర్టు కూడా పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. ఇక గతంలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం తలెత్తిన సందర్భాల్లో రెండు లేదా మూడు రోజుల్లో పార్టీలు ఫ్లోర్ టెస్టు ద్వారా తమ బలం నిరూపించుకోవాలని న్యాయస్థానాలు తీర్పులను వెలువరించాయి. అయితే, తమిళనాడులో ఏ ఒక్క పార్టీ కూడా మ్యాజిక్ మార్కు దాటకపోవడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది.
ఈ నేపథ్యంలో గవర్నర్ ముందు మూడు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అతిపెద్ద పార్టీ అయిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, ఆ తరువాత అసెంబ్లీ వేదికగా బలనిరూపణ చేసుకోవాలని కోరడం గవర్నర్ ముందు ఉన్న మొదటి మార్గం. ఇక టీవీకేకు బదులు సంఖ్యాబలం ఉన్న మరో కూటమికి కూడా గవర్నర్ ఛాన్స్ ఇవ్వచ్చు. చిట్టచివరి ప్రత్యామ్నాయంగా రాష్ట్రపతి పాలన విధించాలని కూడా గవర్నర్ సిఫారసు చేయవచ్చు.
నిపుణులు చెప్పేదాని ప్రకారం, తమిళనాడులో మళ్లీ ఎన్నికలకు రాజ్యాంగపరంగా అవకాశం ఉన్నప్పటికీ ఈ విషయంలో అన్ని పార్టీలు వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రాబోయే రెండు మూడు రోజులు అత్యంత కీలకమని కూడా పరిశీలకులు చెబుతున్నారు. కాబట్టి, టీవీకే తనకు మద్దతు ఉందని రుజువు చేసుకోగలిగితే ఆ పార్టీకి గవర్నర్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాకాక డీఎంకే, అన్నాడీఎంకే జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఏ పక్షం కూడా 118 సీట్ల మార్కును చేరుకోలేని పక్షంలో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నప్పడూ పార్టీలు మళ్లీ చర్చలు జరపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇందుకు అవకాశాలే లేవని తేలితే మాత్రం అసెంబ్లీ రద్దై మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బలం నిరూపించుకున్న వారికే ఛాన్స్.. తమిళనాడు రాజ్‌భవన్ వర్గాలు
పశ్చిమ బెంగాల్‌కు అమిత్ షా.. సీఎం అభ్యర్థి ఎన్నికపై కీలక భేటీ..