మంత్రివర్గ విస్తరణకు విజయ్ రెడీ.. 15 మందికి చోటు
ABN , Publish Date - May 20 , 2026 | 05:19 PM
తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గాన్ని ఈనెల 21న విస్తరించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. టీవీకే ఎమ్మెల్యేలతో పాటు, కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తున్న కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ (C Joseph Vijay) తన మంత్రివర్గాన్ని ఈనెల 21న విస్తరించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. టీవీకే ఎమ్మెల్యేలతో పాటు, కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తున్న కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. అయితే, గత వారం తమిళనాడు అసెంబ్లీలో విశ్వాసపరీక్ష సందర్భంగా టీవీకేకు మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే రెబల్ వర్గం ఎమ్మెల్యేలను మాత్రం క్యాబినెట్‌లోకి తీసుకోవడం లేదు.
కాంగ్రెస్ నామినీలు వీరే
కాంగ్రెస్ నుంచి మంత్రివర్గంలోకి తీసుకునే ఇద్దరు నామినీల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పి.విశ్వనాథన్, ఎస్.రమేష్ కుమార్ ఉన్నారు. వీసీకే, ఐయూఎంఎల్‌కు చెరో మంత్రిపదవి దక్కనుంది. అయితే పేర్లు ఇంకా ఖరారు కాలేదని చెబుతున్నారు.
'గురువారంనాడు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. 15 మంది మంత్రులను క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు. ఇప్పటికే మే 10న ముఖ్యమంత్రితో సహా తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కేరళ నుంచి చెన్నైకి గవర్నర్ ఆర్‌వీ ఆర్లేకర్ ఎప్పుడు వస్తారనేది బుధవారం సాయంత్రానికల్లా ఒక స్పష్టత వస్తుంది' అని టీవీకే వర్గాలు తెలిపాయి.
విజయ్ విముఖత..
అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఎస్‌పీ వేలుమణి, సీవీ షణ్ముగం సారథ్యంలోని అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు క్యాబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉందనే ఊహాగానాలకు టీవీకే తెరదించింది. ఇందుకు విజయ్ విముఖత వ్యక్తం చేసినట్టు ఈ పార్టీ వివరణ ఇచ్చింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలోకి చోటుకల్పిస్తే టీవీకే ప్రభుత్వానికి మద్దతు కొనసాగించడంపై పునరాలోచిస్తామని సీపీఎం, వీసీకే ఇప్పటికే హెచ్చరించాయి. వీసీకే చీఫ్ తిరుమావళన్ తాజా పరిణామాలపై మాట్లాడుతూ, అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను క్యాబినెట్‌లోకి తీసుకోవడం లేదని తనకు సమాచారం అందినట్టు చెప్పారు. దీంతో టీవీకే ప్రభుత్వంలో తమ పార్టీ చేరనుందనే పరోక్ష సంకేతాలను ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
అన్నాడీఎంకేతో ఎలాంటి పొత్తులు లేవు... సీపీఎం వార్నింగ్‌పై టీవీకే
మోదీ, అమిత్‌షాపై మళ్లీ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడిన బీజేపీ