తమిళనాడు సీఎం విజయ్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట
ABN , Publish Date - Jun 02 , 2026 | 08:34 PM
సీఎం విజయ్‌కు మద్రాసు హైకోర్టులో అనుకూల తీర్పు వచ్చింది. ఆదాయ వివరాలు దాచారనే ఆరోపణలతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఐటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు మద్రాసు హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఆయనపై దాఖలైన ఒక కీలక పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. విజయ్ తన ఆదాయ వివరాలను దాచిపెట్టారనే ఆరోపణలపై మనీలాండరింగ్ చట్టం కింద దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జీ అరుల్ మురుగన్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసులో ఇవాళ(మంగళవారం) విచారణ చేపట్టంది. ఈ సందర్భంగా, పిటిషనర్ తాను దాఖలు చేసిన అభ్యర్థనను వెనక్కి తీసుకుంటామని కోర్టును కోరారు. దీంతో ఆ పిటీషన్ విత్‌డ్రాకు కోర్టు అనుమతి ఇచ్చింది.
పిటీషనర్ ప్రకారం.. 2015లో విజయ్ నివాసంలో ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో సుమారు రూ.15 కోట్ల నగదు లభించింది. అది విజయ్ నటించిన ‘పులి’ సినిమా రెమ్యునరేషన్‌లో భాగంగానే ఆ మొత్తం అందినట్లు తేలింది. ఆ డబ్బుకు సంబంధించిన వివరాలను ఆయన తన అకౌంట్స్ లెక్కల్లో వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ.. విజయ్‌పై సుమారు రూ.1.5 కోట్ల జరిమానా విధించింది. అయితే, ఐటీ శాఖ విధించిన ఈ జరిమానాకు వ్యతిరేకంగా విజయ్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ పరిణామాల తర్వాత కొడంగయ్యూర్‌కు చెందిన ఎం. రాజ్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో కొత్తగా మరో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఐటీ సోదాల్లో దొరికిన ఆధారాల బట్టి విజయ్‌పై ఐటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే మోసం, క్రిమినల్ కేసులతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన కోరారు. అయితే, విచారణ దశలో పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అంగీకరించడంతో సీఎం విజయ్‌కు ఈ కేసు నుంచి పూర్తి ఉపశమనం లభించింది.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం