సువేందు అధికారి పీఏ హత్య కేసులో షూటర్ అరెస్టు
ABN , Publish Date - May 18 , 2026 | 09:11 PM
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రనాథ్‌ను కాల్చిచంపిన షూటర్ రాజ్‌కుమార్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో సీబీఐ సోమవారంనాడు అరెస్టు చేసింది.
ముజఫర్‌నగర్: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendu Adhikar) వ్యక్తిగత సహాయకుడు (PA) చంద్రనాథ్ రథ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రనాథ్‌ను కాల్చిచంపిన షూటర్ రాజ్‌కుమార్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో సీబీఐ (CBI) సోమవారంనాడు అరెస్టు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల సాయంతో ఈ అరెస్టు జరిగింది. ఇప్పటికే ట్రాన్సిట్ రిమాండ్ తీసుకున్న సీబీఐ మంగళవారంనాడు కోల్‌కతాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు అతన్ని హాజరుపరచనుంది.
సువేందు అధికారికి అత్యంత విశ్వసనీయుడుగా చంద్రనాథ్ రథ్‌కు పేరుంది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండ్రోజుల తర్వాత మే 6వ తేదీ రాత్రి చంద్రనాథ్ కోల్‌కతా వెళ్తుండగా నార్త్ 24 పరగణాల జిల్లాలోని దోల్తాలో హత్యకు గురయ్యారు. మోటార్ బైక్‌పై వచ్చిన దుండగులు అత్యంత సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ హత్య కేసును తొలుత సిట్ చేపట్టింది. చంద్రనాథ్ కుటుంబానికి న్యాయం చేస్తానని వాగ్దానం చేసిన సీఎం ఆ తర్వాత కేసును సీబీఐకి అప్పగించారు. ఇప్పటికే ఈ కేసులో మయాంక్ రాజ్ మిశ్రా, విక్కీ మౌర్య, రాజ్ సింగ్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. మిశ్రా, మౌర్యలను బిహార్‌లోని బక్సర్‌లోనూ, సింగ్‌ను యూపీలోని బల్లియాలో అదుపులోనికి తీసుకున్నారు.
బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపి తాము ఘనవిజయం సాధించడంతో టీఎంసీనే ఈ హత్యకు పాల్పడిందని బీజేపీ తొలుత ఆరోపించింది. టీఎంసీ ఎంపీ అభిషేక్ ప్రమేయం ఉందంటూ అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ తోసిపుచ్చింది. ఈ హత్యతో ప్రమేయం ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కోర్టు పర్యవేక్షణలో కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్.. విడుదల చేసిన భారత రైల్వే
రోడ్లపై నమాజ్‌లు వద్దు, ముస్లింలు జనాభా నియంత్రించుకోవాలి.. యోగి ఆదిత్యనాథ్