Share News

బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్.. విడుదల చేసిన భారత రైల్వే

ABN , Publish Date - May 18 , 2026 | 07:49 PM

భారతదేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఫోటోను రైల్వే శాఖ సోమవారంనాడు విడుదల చేసింది. న్యూఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖ గేట్ నెంబర్-4 వద్ద ఈ బుల్లెట్ ట్రైన్ తొలి చిత్రాన్ని ప్రదర్శించింది.

బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్.. విడుదల చేసిన భారత రైల్వే
Indian Railways Bullet Train

న్యూఢిల్లీ: భారతదేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ (Bullet Train) ఏ విధంగా ఉండనుందనే ఉత్కంఠకు తెరపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోను రైల్వే శాఖ సోమవారంనాడు విడుదల చేసింది. న్యూఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖ గేట్ నెంబర్-4 వద్ద ఈ బుల్లెట్ ట్రైన్ తొలి చిత్రాన్ని ప్రదర్శించింది. తెలుపు, ఆరెంజ్ రంగుల్లో ఈ బుల్లెట్ ట్రైన్‌ను పెయింట్ చేశారు.


ముంబై-అహ్మదాబాద్‌లను కలుపుతూ 508 కిలోమీటర్లు ప్రయాణించే ఈ బుల్లెట్ ట్రైన్‌ను జపాన్ సాంకేతిక, ఆర్థిక సాయంతో అభివృద్ధి చేస్తున్నారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణిస్తుంది. దీంతో ముంబై, అహ్మదాబాద్ సిటీల మధ్య ప్రయాణ సమయం రెండు గంటలకు తగ్గుతుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKS) నుంచి థానే, విరార్, బోయిసర్, వాపి, సూరత్, బరూచ్, వడోదర, ఆనంద్ వంటి పలు కీలక ప్రాంతాల మీదుగా ప్రయాణించి అహ్మదాబాద్‌లోని సబర్మతికి చేరుకుంటుంది.


2 గంటల 7 నిమిషాలు

సూరత్, వడోదర, అహ్మదాబాద్ వంటి పరిమిత స్టాప్‌లతో 2 గంటల 7 నిమిషాల్లో హైస్పీడు రైలు గమ్యం చేరుతుందని ఇండియన్ రైల్వేస్ తెలిపింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, చట్టపరమైన క్లియెరెన్స్ పూర్తయిందని, కారిడార్‌లోని పలు ప్రాంతాల్లో నిర్మాణ పనులు శ్రీఘ్రగతిని జరుగుతున్నాయని వివరించింది. సూరత్, వడోదర, అహ్మదాబాద్, సబర్మతి సహా ఎనిమిది స్టేషన్లలో శంకుస్థాపన పనులు కూడా పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని ధానే, విరార్, బోయిసర్‌లో పనులు కొనసాగుతుండగా, అండర్ గ్రౌండ్ బీకేసీ స్టేషన్ వద్ద తవ్వకాల పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ప్రాజెక్టులో భాగంగా 17 రీవర్ బ్రిడ్జిల పనులు పూర్తయ్యాయి. నర్మదా, మహి, తపతి, సబర్మతి నదులపై కీలక బ్రిడ్జిల నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సెక్షన్లలో మహారాష్ట్రలోని 21 కిలోమీటర్ల అండర్-సీ టన్నెల్ ఒకటి. ఇందులో భాగంగా ఘన్సోలి-శిల్పాట మధ్య 4.8 కిలోమీటర్ల టన్నెల్ వర్క్ ఇప్పటికే పూర్తిచేశారు. ఈ బుల్లెట్ ట్రైన్ అంచనా వ్యయం లక్షా 8 వేల కోట్లు కాగా, 2028 నాటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తికావలసి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

రోడ్లపై నమాజ్‌లు వద్దు, ముస్లింలు జనాభా నియంత్రించుకోవాలి.. యోగి ఆదిత్యనాథ్

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి

Updated Date - May 18 , 2026 | 07:59 PM