Share News

లాలూకు సుప్రీంలో చుక్కెదురు... వ్యక్తిగత హాజరు నుంచి మాత్రం మినహాయింపు

ABN , Publish Date - Apr 13 , 2026 | 03:05 PM

భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తనపై, తన కుటుంబ సభ్యులపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ లాలూ వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు తోసిపుచ్చింది.

లాలూకు సుప్రీంలో చుక్కెదురు... వ్యక్తిగత హాజరు నుంచి మాత్రం మినహాయింపు
Lalu Prasad Yadav

న్యూఢిల్లీ: భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ (Lalu Prasad Yadav)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో నిరాశ ఎదురైంది. తనపై, తన కుటుంబ సభ్యులపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ లాలూ వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు తోసిపుచ్చింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటేశ్వర సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. కేసులో మెరిట్స్‌ను పరిశీలించే అధికారాన్ని ట్రయిల్ కోర్టుకే విడిచిపెడుతూ, చట్టప్రకారం విచారణ కొససాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. అయితే ట్రయల్ కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి లాలూకు మినహాయింపు ఇచ్చింది.


ఈకేసులో ఇంతకుముందు లాలూ ప్రసాద్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తలిగింది. సీబీఐ తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ లాలూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని కోర్టు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని లాలూ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపైనే సుప్రీం తాజా తీర్పు చెప్పింది.


లాలూ ప్రసాద్ యాదవ్ 2004-2009 మధ్య కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాల కేటాయింపులో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో రైల్వేలోని వివిధ జోన్లలో అనేక మందిని గ్రూప్-డి పోస్టుల్లో నియమించారు. దీనికి బదులుగా వారి భూములను లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులతో పాటు ఒక ప్రైవేటు కంపెనీకి బదిలీ చేశారని సీబీఐ ఆరోపణగా ఉంది. 2022 మే 18న లాలూ, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు, గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదైంది. 77 ఏళ్ల లాలూ, ఇతర నిందితులు ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. కాగా, సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషన్, చార్జిషీట్లలో చట్టపరమైన లోపాలున్నాయని లాలూ వాదనగా ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 17ఏ కింద సీబీఐ ముందస్తు అనుమతి తీసుకోలేదని, ఇందువల్ల సీబీఐ ప్రొసీడింగ్స్‌ చెల్లనేరవని లాలూ వాదించారు. అయితే ఈ వాదనను తాజాగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో లాలూ కుటుంబానికి న్యాయపరంగా మరిన్ని చిక్కులు తప్పేలాలేవు.


ఇవి కూడా చదవండి..

పవన్ ఖేడా ట్రాన్సిట్ బెయిలుపై సుప్రీంకోర్టుకు అసోం ప్రభుత్వం

బీహార్ కొత్త సీఎం ఆయనే.. ప్రమాణస్వీకారానికి మోదీ, అమిత్‌షా

Updated Date - Apr 13 , 2026 | 03:08 PM