Share News

బీహార్ కొత్త సీఎం ఆయనే.. ప్రమాణస్వీకారానికి మోదీ, అమిత్‌షా

ABN , Publish Date - Apr 13 , 2026 | 02:09 PM

బిహార్‌లో బీజేపీ ముఖ్యమంత్రి తొలిసారి పగ్గాలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా పదోన్నత పొందే అవకాశాలున్నాయి.

బీహార్ కొత్త సీఎం ఆయనే.. ప్రమాణస్వీకారానికి మోదీ, అమిత్‌షా
Samrat Chaudhary and Nitish Kumar

పాట్నా: బిహార్‌లో బీజేపీ ముఖ్యమంత్రి తొలిసారి పగ్గాలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి (Samrat choudhary) ముఖ్యమంత్రిగా పదోన్నత పొందే అవకాశాలున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడంతో చివరిసారిగా ఈనెల 14న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, అనంతరం తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించనున్నారు. దీంతో ఎన్డీయే సారథ్యంలో కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమవుతుంది. దీనికి ముందే ఎన్డీయే శాసనసభా పక్ష సమవేశం ఏర్పాటు చేసి, లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకోనున్నారు.


ఏప్రిల్ 15న ప్రమాణస్వీకారం

ఎన్డీయే కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం ఏప్రిల్ 15న పాట్నాలోని లోక్‌భవన్ ప్రాంగణంలో ఉన్న రాజ్‌భవన్‌లో జరుగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు చెబుతున్నారు. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి పాట్నాకు మోదీ చేరుకుంటారని, రాత్రి అక్కడే బస చేస్తారని తెలుస్తోంది.


సామ్రాట్‌కే..

కొత్త ముఖ్యమంత్రిగా బీజీపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి అవకాశాలు బలంగా ఉన్నాయని, ఆయనకు పదోన్నతి దాదాపు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. కొయెరి సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరికి ఓబీసీ వర్గాల్లో మంచి పేరుంది. 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఏడాది తర్వాత ఉపముఖ్యమంత్రి అయ్యారు.


కాగా, రాబోయే రెండు రోజులు కీలక సమావేశాలు ఉన్నందున పాట్నాలోనే ఉండాలని ఎన్డీయే ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లాయి. లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కొత్త నేతను లాంఛనంగా ఎన్నుకోనున్నారు. లెజిస్లేచర్ పార్టీ నేత ఎంపికను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కేంద్ర పరిశీలకుడిగా బీజేపీ పార్టమెంటరీ బోర్డు నియమించింది.


ఇవి కూడా చదవండి..

21వ శతాబ్దం మహిళలదే.. కొత్త చరిత్రను లిఖించనున్నాం: మోదీ

మోదీ యూటర్న్‌కు 30 నెలలు పట్టింది.. పార్లమెంటు ప్రత్యేక సమావేశంపై సోనియాగాంధీ ఫైర్

Updated Date - Apr 13 , 2026 | 02:30 PM