నాలుగేళ్ల చిన్నారితో ఇలాగేనా ప్రవర్తించేంది.. పోలీసులకు సుప్రీం చురకలు
ABN , Publish Date - Mar 25 , 2026 | 02:38 PM
ఓ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో పోలీస్ అధికారులు ప్రవర్తించిన తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ కోసం పోలీసులు బాధితురాలికి ఇంటికి వెళ్లకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ.. అలా వ్యవహరించేందుకు వాళ్లేమైనా రాజులా అని వ్యాఖ్యానించింది.
ఇంటర్నెట్ డెస్క్: నాలుగేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో గురుగ్రామ్ పోలీసులు స్పందించిన తీరును తీవ్రంగా తప్పుపట్టింది సర్వోన్నత న్యాయస్థానం. ఆ చిన్నారితో పాటు వారి తల్లిదండ్రులతో అధికారులు ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడింది. బాలికను క్రాస్-ఎగ్జామినేషన్ చేసిన అధికారులను మందలిస్తూ.. ఈ చర్యలు ఆ బాలికను మరింత మానసిక వేదనకు గురిచేయడం సహా అగౌరవపరిచాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తమ కూతురిపై అత్యాచారం జరిగిందని గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ తల్లిదండ్రులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. నిందితుడి సమక్షంలో మేజిస్ట్రేట్.. ఆ బాలికను ఎలా ప్రశ్నించారనే దానిపై పోలీసులు, జిల్లా న్యాయవ్యవస్థ వివరణ ఇవ్వాలని కోరింది. 'పోలీసులు బాధితురాలి ఇంటికి ఎందుకు వెళ్లలేరు? వాళ్లేమైనా రాజులా?' అని ఈ సందర్భంగా సీజేఐ ప్రశ్నించారు. ఈ కేసులో హరియాణా తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. చిన్నారులపై లైంగిక నేరాల నుంచి రక్షణ(పోక్సో) చట్టంలోని సెక్షన్ 6(నేరం రుజువైతే 20ఏళ్ల జైలుశిక్ష) నుంచి నేరాన్ని సెక్షన్ 10(పదేళ్ల జైలుశిక్ష)కి ఎందుకు కుదించారని ధర్మాసనం నిలదీసింది. బాలల సంక్షేమ కమిటీ నివేదిక ఆధారంగా అభియోగాలను మార్చినట్టు భాటి సమాధానమివ్వగా.. బాలిక వాంగ్మూలం కంటే ఆ నివేదికకు ఎందుకు ప్రాధాన్యమిచ్చారని ప్రశ్నిస్తూ.. అసమర్థమైన విషయాన్ని సమర్థించవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది.
'డీసీపీ, ఏసీపీ హోదా కలిగిన పోలీస్ అధికారులు ఈ విచారణలో భాగమయ్యారు. ఆ చిన్నారిపై జరిగిన నేరం గురించి వారి అవగాహన ఇదే అయితే, మరి చట్టబద్ధమైన పాలన సంగతేంటి? అత్యాచారం అంటే లైంగిక చొరబాటు మాత్రమే కాదు. ఈ విషయంలో పోలీసులకు స్పష్టమైన అవగాహన లేకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. నేర తీవ్రతను తగ్గించేందుకే అత్యున్నత పోలీస్ అధికారులను రంగంలోకి దించారు' అని జస్టిస్ బాగ్చి అన్నారు.
'పోలీసులు కనీసం చట్టాన్ని చదవలేదు. నాలుగేళ్ల చిన్నారి నిర్దోషిత్వాన్ని నమ్మలేదు. వారికి సిగ్గుండాలి. రాష్ట్రానికి చట్టంపై ఏమాత్రం గౌరవం ఉన్నా, వారిని తక్షణమే బదిలీ చేయాలి. సీసీటీవీ కెమెరాలు లేవని చెబుతున్నారు. 15 రోజులుగా ఏమీ చేయకుండా.. మేమీ కేసును పరిగణనలోకి తీసుకున్నాకే అరెస్ట్‌లు మొదలెట్టారు. మీరెందుకంత తీరిక లేకుండా ఉన్నారో మేమే చెప్పాలా? ఈ కేసు సున్నితత్వం లేమికి పరాకాష్టగా నిలుస్తోంది. సీడబ్ల్యూసీ సభ్యులు ఎవరు? వారిని ఎవరు నియమిస్తారు? వారి అర్హతలేమిటి?' అని సీజేఐ సూర్యకాంత్ ప్రశ్నలవర్షం కురిపించారు.
ఈ కేసు నమోదులో భాగంగా అఫిడవిట్‌లో పలుమార్లు ఆ చిన్నారి పేరు ప్రస్తావించడంపైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుగ్రామ్ పోలీసులు నిర్లక్ష్యపూరితమైన, బాధ్యతారహితమైన, పూర్తిగా చట్టవిరుద్ధమైన దర్యాప్తు విధానాన్ని కొనసాగించారని.. ఈ తీరుతో ఆ చిన్నారి మరింత మానసిక క్షోభకు గురై ఉంటుందని అభిప్రాయపడింది.
ఇవీ చదవండి:
ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు.. అందులో ఏమున్నాయంటే?
యుద్ధంలో మేమే గెలిచాం.. సైనికపరంగా ఇరాన్‌ను అంతమొందించాం: ట్రంప్