Share News

ఈడీ ఐప్యాక్ దాడుల్లో జోక్యం.. మమతా బెనర్జీని మందలించిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - Mar 18 , 2026 | 07:50 PM

కోల్‌కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయంపై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపిన సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇది హర్షించదగిన పరిణామం కాదని పేర్కొంది.

ఈడీ ఐప్యాక్ దాడుల్లో జోక్యం.. మమతా బెనర్జీని మందలించిన సుప్రీంకోర్టు
Mamata Banerjee

న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయంపై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు జరిపిన సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు (Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. ఇది హర్షించదగిన పరిణామం కాదని పేర్కొంది. ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో కేంద్ర ఏజెన్సీని ఎలాంటి పరిష్కారం లేకుండా వదిలేయవచ్చా అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మమతాబెనర్జీ జోక్యంపై ఈడీ వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎన్‌వీ అంజారియాతో కూడిన ధర్మాసనం బుధవారంనాడు విచారణ జరిపింది.


'రేపటి రోజు ఇలాంటి రైడ్స్ జరిగినప్పుడు మరో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటే పరిస్థితి ఏమిటి? ఈడీని ఎలాంటి పరిష్కారం లేకుండా వదిలేయవచ్చా?' అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ఎలక్షన్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ అధిపతి ప్రతీక్ జైన్ నివానంపై దాడుల సందర్భంగా ముఖ్యమంత్రి చర్యలను ఈడీ తన పిటిషన్‌లో తప్పుపట్టింది. ప్రతీక్ జైన్ నివాసం నుంచి ల్యాప్‌ట్యాప్, ఫోన్, పలు డాక్యుమెంట్లు తీసుకుని ఆమె వెళ్లిపోవడం పూర్తిగా అధికార దుర్వినియోగమే అవుతుందని పేర్కొంది. ముఖ్యమంత్రితో పాటు అమెతో ఉన్న అధికారులపై పోలీసు కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. కాగా, ఈ కేసు విచారణను మార్చి 24వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.


ఈడీ దాడులు

బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో భాగంగా జనవరి 8న ప్రతీక్ జైన్ కార్యాలయంపై ఈడీ దాడులు జరిపింది. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హుటాహుటిన అక్కడికి రావడం, ఆయన నివాసం నుంచి ఒక ల్యాప్‌టాప్, ఫోన్, పలు ఫైళ్లు తీసుకుని వెళ్లిపోవడంతో హైడ్రామా చోటుచేసుకుంది. మమతా బెనర్జీ చర్యలను ఈడీ తప్పుపట్టింది. ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించింది. అయితే ఈడీ దాడులు రాజ్యాంగ విరుద్ధమని మమతా బెనర్జీ తప్పుపట్టారు. అసెంబ్లీ ఎన్నికల వేళ తమ పార్టీ రాజకీయ వ్యూహం, అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈడీతో ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. టీఎంసీ పార్టీ హార్డ్‌డిస్క్‌ను తీసుకునేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాగా, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరుగనున్నాయి.


ఇవి కూడా చదవండి..

నితిన్ గడ్కరీని కలిసిన రాహుల్, ప్రియాంక గాంధీ

ప్రేమ మాతో, పెళ్లి మోదీతో.. రాజ్యసభలో ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Mar 18 , 2026 | 08:09 PM