Share News

ప్రేమ మాతో, పెళ్లి మోదీతో.. రాజ్యసభలో ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 18 , 2026 | 03:52 PM

రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యుల వీడ్కోలు సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారంనాడు కాసేపు నవ్వులు పూయించారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడను ఉద్దేశించి మాట్లాడుతూ, గత 54 ఏళ్లుగా ఆయన తనకు తెలుసునని, ఆయనతో కలిసి పనిచేశానని చెప్పారు.

ప్రేమ మాతో, పెళ్లి మోదీతో.. రాజ్యసభలో ఖర్గే ఆసక్తికర  వ్యాఖ్యలు
Mallikarjun Kharge

న్యూఢిల్లీ: రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యుల వీడ్కోలు సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) బుధవారం నాడు కాసేపు నవ్వులు పూయించారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడను ఉద్దేశించి మాట్లాడుతూ, గత 54 ఏళ్లుగా ఆయన తనకు తెలుసని, ఆయనతో కలిసి పనిచేశానని చెప్పారు. 'అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ, ఆయన మాతో ప్రేమ సాగించి మోదీని పెళ్లి చేసుకున్నారు' అంటూ చమత్కరించారు. దీంతో సభలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా సభ్యులంతా నవ్వులు చిందించారు. దేశానికి సేవ చేయాలనే తపన కలిగిన వారు రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఎన్నడూ అలసిపోరని ఖర్గే అన్నారు.


దేవెగౌడ 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత సుమారు ఒక ఏడాది పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతిచ్చింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హెచ్‌డీ దేవెగౌడ 'జేడీఎస్'తో కాంగ్రెస్ పొత్తు సాగించింది. ఆ కూటమి విజయం సాధించింది. దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019లో పలువురు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకుంది.


కాగా, రాజ్యసభ సభ్యుల వీడ్కోలు సెషన్‌లో శరద్ పవార్, డీఎంకే నేత తిరుచ్చి శివతో తన అనుబంధాన్ని కూడా ఖర్గే గుర్తుచేసుకున్నారు. అయితే పవార్, తిరుచ్చి శివ తిరిగి రాజ్యసభకు రాబోతున్నారు. ఖర్గే తన ప్రసంగంలో కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ(ఏ) చీఫ్ రామ్‌దాస్ అథవాలేపై కూడా ఛలోక్తులు విసిరారు. 'ఆయన ఎప్పుడూ తన కవితల్లో మోదీని పొగుడుతుంటారు. ఆయనకు మరే ఇతర కవితలు తెలియవేమో' అంటూ చమత్కరించారు.


రాజకీయాల్లో ఫుల్‌స్టాప్‌లు ఉండవు: మోదీ

రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ, పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజాసేవ ముగిసినట్టు కాదన్నారు. రాజ్యసభ మేధావుల వేదిక అని, ఇక్కడ లభించే జ్ఞానానికి విలువ కట్టలేమని అన్నారు. హెచ్‌డీ దేవెగౌడ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్ వంటి దిగ్గజ నేతల సహకారాన్ని మరువలేమని, సగానికి పైగా తమ జీవితాన్ని పార్లమెంటుకే అంకితం చేశారని ప్రశంసించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు వారి నుంచి నేర్చుకోవాల్సినది ఎంతైనా ఉంటుందని సూచించారు.


ఇవి కూడా చదవండి..

రజనీని బాధపెట్టాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు.. టీవీకే నేత క్షమాపణలు..

కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్

Updated Date - Mar 18 , 2026 | 04:18 PM