కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్
ABN , Publish Date - Mar 18 , 2026 | 02:49 PM
అస్సాంలో మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ లోక్‌సభ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ భారతీయ జనతా పార్టీలో బుధవారంనాడు చేరారు.
గువాహటి: అస్సాం (Assam)లో మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ లోక్‌సభ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ (Pradyut Bordoloi) భారతీయ జనతా పార్టీ (BJP)లో బుధవారంనాడు చేరారు. దీనికి ఒకరోజు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ సైకియా సమక్షంలో బీజేపీలో చేరారు.
కాంగ్రెస్‌లో ఉక్కిరిబిక్కిరయ్యా
బీజేపీలో చేరిన అనంతరం ప్రద్యుత్ బోర్డోలోయ్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని వీడటానికి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. పార్టీలో తాను ఉక్కిరిబిక్కిరయ్యానని, అవమానాలకు గురయ్యానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు చాలా ఇచ్చిందని, అయితే ఆత్మగౌరవం తనకు ముఖ్యమని అన్నారు. లోక్‌సభలో రెండో టర్మ్ పూర్తికావడానికి ఇంకా మూడేళ్లు ఉందని, ఎంపీగానే ఉండాలనుకుంటే అవమానాలను భరించి ఉండేవాడినని, అయితే పార్టీని వీడడానికే తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. బీజేపీలోకి నాగాన్ ఎంపీ ప్రద్యుత్ రాకను స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. 1975 నుంచి ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారని, ఆయన రాకతో ఇప్పటికే పటిష్ఠంగా ఉన్న బీజేపీ మరింత బలపడుతుందని అన్నారు. ఆత్మగౌరవం కావాలనుకున్న వారు కాంగ్రెస్‌లో ఇమడలేరని, మరింత మంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీలోకి రానున్నారని చెప్పారు.
ప్రద్యుత్‌ను సీఎం మభ్యపెట్టారు: గౌరవ్ గొగోయ్
ప్రద్యుత్ రాజీనామాపై అస్సాం కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ, మీడియా ద్వారా ప్రద్యుత్‌ను ముఖ్యమంత్రి మభ్యపెట్టారని చెప్పారు. కాగా, ప్రద్యుత్ కుమారుడు ప్రతీక్ కాంగ్రెస్ అభ్యర్థిగా మార్గెరీటా నియోజకవర్గం నుంచి ఏప్రిల్ 9న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రజినీని బాధపెట్టాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు.. టీవీకే నేత క్షమాపణలు..
భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం!