Share News

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది సజీవదహనం

ABN , Publish Date - Mar 18 , 2026 | 01:27 PM

దేశ రాజధాని ఢిల్లీలోని పాలం ప్రాంతంలో బుధవారం పెను విషాదం చోటుచేసుకుంది. ఓ బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 మంది సజీవదహనం అయ్యారు.

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది సజీవదహనం
Delhi Fire Accident

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని పాలం ప్రాంతంలో ఈరోజు(బుధవారం) పెను విషాదం చోటుచేసుకుంది. ఓ బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్(DFS) సిబ్బంది, రెస్క్యూ టీమ్ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

delhi firej.jpg


ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ‘నైరుతి ఢిల్లీలోని పాలం(సాద్ నగర్) మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనంలో ఉదయం సుమారు 7 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు కాల్ వచ్చింది. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది 25 ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాం. మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు భవనంపై నుంచి దూకి గాయపడగా.. వారిని ఆస్పత్రిలో చేర్పించాం. అగ్నిమాపక, సహాయక చర్యల అనంతరం మంటలను ఆర్పివేశాం’ అని అన్నారు.


ఈ ఘటనపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘పాలంలోని బహుళ అంతస్తుల నివాస భవనంలో జరిగిన దురదృష్టకర అగ్నిప్రమాదం గురించి తెలుసుకుని తీవ్రంగా కలత చెందాను’ అని పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు పాలం మెట్రో సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు ఆందోళన వ్యక్తం చేశారు. సహాకయ, అగ్నిమాపక చర్యలను అధికారులు పర్యవేక్షిస్తున్నారని, బాధితులకు అవసరమైన సహాయ సహకారాల్ని అందిస్తున్నారని ఆయన తెలిపారు.

Updated Date - Mar 18 , 2026 | 02:45 PM