Share News

కేరళం కాంగ్రెస్‌ కార్యవర్గసభ్యులకు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు!

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:27 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ను లక్ష్యంగా చేసుకొని, ఆయన రాజీనామా చేయాలంటూ ఇటీవల ఎక్స్‌లో పెట్టిన ఓ పోస్టుకు సంబంధించి కేరళం కాంగ్రెస్‌ కార్యవర్గసభ్యులందరికీ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

కేరళం కాంగ్రెస్‌ కార్యవర్గసభ్యులకు   సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు!
cjisuryakanth

  • సీజేఐ సూర్యకాంత్‌

  • రాజీనామా కోరుతూ ఎక్స్‌లో వివాదాస్పద పోస్టు ఫలితమే

న్యూఢిల్లీ, నవంబరు 6: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ను లక్ష్యంగా చేసుకొని, ఆయన రాజీనామా చేయాలంటూ ఇటీవల ఎక్స్‌లో పెట్టిన ఓ పోస్టుకు సంబంధించి కేరళం కాంగ్రెస్‌ కార్యవర్గసభ్యులందరికీ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సీజేఐకి వ్యతిరేకంగా అక్టోబరు 12న తన అధికారిక ఎక్స్‌ హ్యాండిల్‌లో కేరళం కాంగ్రెస్‌ ఈ వివాదాస్పదమైన పోస్టు చేసింది. ‘‘డియర్‌ సూర్యకాంత్‌! శాంతిభద్రతలు మీ పరిధిలోని అంశం కాకపోతే వెంటనే రాజీనామా చేయండి. దానిని సమర్థంగా నిర్వహించగల మరొకరిని మేం వెతుక్కుంటాం’’ అంటూ ఆ పోస్టులో ఉంది. ఈ పోస్టు వైరల్‌ అయింది. దీనిపై విమర్శలు వ్యక్తమవడంతో పోస్టును తొలగించారు. ఈ పోస్టుపై అక్టోబరు 13న సీజేఐ సూర్యకాంత్‌కు వినీత్‌ జిందాల్‌ అనే న్యాయవాది ఫిర్యాదు చేయగా, 30న సుప్రీం విచారణకు స్వీకరించింది. ఈ కేసును శుక్రవారం జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ విపుల్‌ పంచోలియాతో కూడిన ధర్మాసనం విచారించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రత అనేది రాజకీయ సౌలభ్యం కోసం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. భావప్రకటన స్వేచ్ఛ అనేది న్యాయ పాలనకు ఆటంకం కలగించడానికో, బెదిరించడానికో కవచంగా మారకూడదని పేర్కొంది. న్యాయపరమైన సంయమనాన్ని సంస్థాగతమైన బలహీనతగా భావించొద్దని, కోర్టు అధికారాన్ని బలహీన పరిచే ఏ ప్రయత్నాన్నయినా ఉక్కు పిడికిలితో అణచివేస్తామని ధర్మాసనం హెచ్చరించింది. కాగా కార్యవర్గసభ్యులకు తెలియకుండానే ఎక్స్‌లో ఆ పోస్టు పడిందని, దాన్ని వెంటనే తొలగించినట్లు, ఆ పోస్టుపై బేషరతుగా క్షమాపణలు కూడా చెబుతూ పత్రికా ప్రకటన కూడా విడుదల చేసినట్లు కేరళం కాంగ్రెస్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

ఇవి కూాడా చదవండి...

శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్‌’తో సమస్యకు చెక్

ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.

Updated Date - Nov 07 , 2026 | 06:36 AM