Share News

ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత..

ABN , Publish Date - Nov 06 , 2026 | 09:50 PM

ఓబీసీ క్రీమీలేయర్‌పై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇప్పటికే పూర్తయిన నియామకాలు, పదోన్నతులకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓబీసీ క్రీమీలేయర్‌ నిర్ణయంలో తల్లిదండ్రుల జీతం ఒక్కటే ప్రామాణికం కాదని 2026 మార్చి 11న ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై వివరణ కోరుతూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది.

ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత..
OBC Creamy Layer

ఢిల్లీ: ఓబీసీ క్రీమీలేయర్‌పై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇప్పటికే పూర్తయిన నియామకాలు, పదోన్నతులకు క్రీమీలేయర్ వర్తించదని రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓబీసీ క్రీమీలేయర్‌ నిర్ణయంలో తల్లిదండ్రుల జీతం ఒక్కటే ప్రామాణికం కాదని 2026 మార్చి 11న ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై వివరణ కోరుతూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మార్చి 11 నాటి తీర్పుపై స్పష్టతనిచ్చింది. ఓబీసీ క్రీమీలేయర్‌ నిర్ణయానికి తల్లిదండ్రుల జీతంతో పాటు వారు పనిచేసిన పోస్టు హోదా, కేటగిరీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది. మార్చి 11 నాటి తీర్పు ప్రధానంగా ఆ కేసులోని పిటిషనర్లకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.


ఇప్పటికే పూర్తయిన నియామకాలు, ఎంపికలు, పదోన్నతులు, సీనియారిటీ విషయంలో ఈ తీర్పును ఆధారంగా చేసుకోరాదని ధర్మాసనం పేర్కొంది. అలాగే, ఇప్పటికే నియామకాలు పొందిన ఇతర ఉద్యోగుల సీనియారిటీకి ఎలాంటి నష్టం కలగకూడదని వ్యాఖ్యానించింది. వివిధ కోర్టులు, ట్రైబ్యునళ్లలో పెండింగ్‌లో ఉన్న ఇలాంటి కేసులను వాటి మెరిట్స్ ఆధారంగా సంబంధిత న్యాయస్థానాలు నిర్ణయించవచ్చని సూచించింది. 2026 మార్చి 11 తర్వాత చేపట్టే నియామకాలు, ఎంపికలు, రోస్టర్ పాయింట్ల కేటాయింపుల్లో సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలను అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష-2025 ద్వారా ఎంపికైన ఓబీసీ అభ్యర్థులకు సర్వీసుల కేటాయింపులో మార్చి 11 నాటి తీర్పు వర్తిస్తుందని స్పష్టం చేసింది. సివిల్ పరీక్షల్లో ఎంపికైన 958 మంది అభ్యర్థులకు సర్వీసుల కేటాయింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు ఎంపికల్లో ఓబీసీ క్రీమీలేయర్‌ నిబంధనను తాజా తీర్పు ప్రకారం అమలు చేయాలని ఆదేశించింది.


ఈ సందర్భంగా ఓబీసీ క్రీమీలేయర్‌ విధానంపై కొత్త పాలసీని రూపొందించుకునే స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలతో సమానమైన హోదాలను ఇతర సంస్థల్లో గుర్తించేందుకు రెండేళ్ల గడువు కోరిన కేంద్రం అభ్యర్థనపై నిర్దిష్ట గడువు విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పోస్టుల సమానత్వంపై నిర్ణయం, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు, విధాన రూపకల్పన వంటివి కేంద్రం, చట్టసభల పరిధిలోని అంశాలని వ్యాఖ్యానించింది.


కేంద్రం పిటిషన్‌లో ప్రధాన అంశాలు..

మార్చి 11 నాటి తీర్పును గతంలో పూర్తయిన నియామకాలు, విద్యా ప్రవేశాలకు వర్తింపజేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్రం తన పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రంతో పాటు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన నియామకాలు, అడ్మిషన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌ అర్హత, సీనియారిటీ, ఉద్యోగ నిబంధనలు, పదోన్నతుల విషయంలో గందరగోళం ఏర్పడుతుందని అభిప్రాయపడింది. ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), బ్యాంకులు, యూనివర్సిటీలు, ప్రైవేటు సంస్థల్లోని పోస్టులకు ప్రభుత్వ ఉద్యోగాలతో సమాన హోదా నిర్ణయించేందుకు రెండేళ్ల సమయం కోరింది. సర్వీసుల కేటాయింపుపై నిర్ణయం వచ్చే వరకు 2025 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపికైన 958 మందికి కేటాయింపులు పూర్తి చేసేందుకు అనుమతి కోరింది.


ఈ వార్తలు కూడా చదవండి

పెట్రోల్‌లో 20 శాతానికి మించి ఇథనాల్.. కర్ణాటక ప్రభుత్వం సంచలన ఆరోపణలు

ఓటర్ల జాబితాలో పేరు లేదా?.. గుడ్ న్యూస్ చెప్పిన ఎన్నికల సంఘం..

Updated Date - Nov 06 , 2026 | 09:53 PM