బార్ కౌన్సిల్ కమిటీల నియామకం చెల్లదు
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:03 AM
బార్ కౌన్సిల్ కమిటీలను నామినేటెడ్ పద్ధతిలో నియమించడం చెల్లదని సుప్రీంకోర్టు పేర్కొంది.
చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిందే.. ఏకగ్రీవమయ్యే చాన్సున్నా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సిందే
తెలంగాణ బార్ కౌన్సిల్‌కమిటీలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
ఎన్నికల నిర్వహణకు తెలంగాణ బార్ కౌన్సిల్ అంగీకారం
అప్పటివరకూ బీసీఐ మధ్యంతర ఉత్తర్వుల కొనసాగింపు
న్యూఢిల్లీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): బార్ కౌన్సిల్ కమిటీలను నామినేటెడ్ పద్ధతిలో నియమించడం చెల్లదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. తెలంగాణ బార్ కౌన్సిల్ కమిటీల నియామకం విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) విధించిన మధ్యంతర స్టేపై దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్, ఎన్‌రోల్‌మెంట్, ప్రివిలేజ్, లైబ్రరీ, ఫైనాన్స్, డిసిప్లినరీ కమిటీల విషయంలో అడ్వకేట్స్ యాక్ట్-1961లోని నిబంధనలు పాటించలేదంటూ వెంకట్‌యాదవ్, పొన్నం అశోక్‌గౌడ్, రోహిణి స్మిత, సునీల్‌గౌడ్, ఎంఏకే ముఖీద్.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కమిటీల నియామకంపై బీసీఐ అక్టోబరు 23న మధ్యంతర స్టే విధించింది. బీసీఐ నిర్ణయాన్ని అక్టోబరు 30న తెలంగాణ బార్ కౌన్సిల్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్ శుక్రవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ బార్ కౌన్సిల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, ఏవోఆర్ పి.మోహిత్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఏకపక్షంగా కమిటీలను నియమిస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. బార్ కౌన్సిల్‌కు 23 మంది సభ్యులు ఎన్నికైన వారని, వారిలో మెజారిటీ సభ్యులు.. అంటే 18 మంది ప్రతినిధులు కమిటీల నియామక బాధ్యతను చైర్మన్‌కు అప్పగించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల ప్రక్రియలో పోటీ లేని సందర్భాల్లో.. కమిటీలను నామినేట్ చేసే అధికారం చైర్మన్‌కు ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు.
చట్టబద్ధమైన ప్రక్రియనుఎలా పక్కన పెడతారు?
చట్టబద్ధమైన ఎన్నికల ప్రక్రియను ఎలా పక్కన పెడతారని ధర్మాసనం ప్రశ్నించింది. ఏకగ్రీవమయ్యే అవకాశమున్నా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాల్సిందేనని స్పష్టం చేసిం ది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించకుండానే ఏకగ్రీవం చేయడం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని అభిప్రాయపడింది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని దామా శేషాద్రినాయుడు తెలిపారు. అయితే ఎన్నిక లు నిర్వహిస్తామంటే ఇక ఇబ్బందేం ఉంటుందని వ్యాఖ్యానించింది. చట్టబద్ధంగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పూర్తి నివేదికను బీసీఐకి పంపాలని, అప్పటివరకు బీసీఐ విధించిన మధ్యంతర స్టే యథావిధిగా కొనసాగుతుందని పిటిషన్‌ను పరిష్కరించింది.
ఇవి కూాడా చదవండి...
శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్’తో సమస్యకు చెక్
ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.