క్యాన్సర్ మందు తయారీ, అమ్మకానికి అంత వ్యత్యాసమా?.. కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు..
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:26 PM
ఔషధాలు, వైద్య పరికరాల తయారీ, అమ్మకం ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా క్యాన్సర్ మందుల తయారీ ధరకు, వాటి ఎమ్మార్పీకి మధ్య భారీ వ్యత్యాసం ఉండటంపై కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం ప్రశ్నలు సంధించింది.
న్యూఢిల్లీ: ఔషధాలు, వైద్య పరికరాల తయారీ, అమ్మకం ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా క్యాన్సర్ మందుల తయారీ ధరకు, వాటి ఎమ్మార్పీ (MRP)కి మధ్య భారీ వ్యత్యాసం ఉండటంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. మందులు, వైద్య పరికరాల ధరలపై దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఈరోజు (మంగళవారం) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా క్యాన్సర్ మందు తయారీకి రూ.3 వేలు అవుతుండగా.. ఎమ్మార్పీ రూ.27 వేలుగా ఎలా నిర్ణయిస్తారంటూ కేంద్రాన్ని నిలదీసింది.
మందులు, వైద్య పరికరాలను నిత్యావసర సరకులుగా పరిగణించి, వాటి ధరలను నియంత్రించేందుకు మరింత సమర్థవంతమైన విధానం ఎందుకు తీసుకురావడం లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఔషధాల ధరల విషయంలో 16 శాతం పరిమితిని (క్యాపింగ్) ఎందుకు అమలు చేయడం లేదనీ ఆరా తీసింది. క్యాన్సర్ మందుల ఎమ్మార్పీలు వాటి తయారీ వ్యయంతో పోలిస్తే అనేక రెట్లు అధికంగా ఉండటంపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని మందుల ధరలు తయారీ ధర కంటే పది రెట్లు అధికంగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి భారీ వ్యత్యాసాలకు కారణమేంటని ప్రశ్నించింది. ప్రతి మందు, ప్రతి వైద్య పరికరం ప్రజలకు అవసరమైనదేనని.. అలాంటప్పుడు వాటిని డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO) పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని నిలదీసింది.
ఔషధాల రీటైలర్ ధరపై 16 శాతానికి మించి లాభం ఎందుకు ఉండాలన్న అంశాన్నీ ధర్మాసనం ప్రస్తావించింది. అధిక ఎమ్మార్పీల కారణంగా ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా ఖర్చు చేస్తున్న ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని అభిప్రాయపడింది. ఈ అంశంపై దాఖలైన పిటిషనర్ల వాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు కోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఔషధ తయారీదారులు, విక్రేతలు, ఆస్పత్రులు, రోగులు వంటి అన్ని పక్షాల ప్రయోజనాలను కాపాడే మార్గం కనుగొంటుందని ఆయన చెప్పారు. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 12కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
బిహార్, యూపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు
నిరసన బాట పట్టాలని 'జెన్ జీ' యువతకు రాహుల్ గాంధీ పిలుపు