Share News

బీసీలు ఎంత మంది ఉన్నారో తెలియాలి!

ABN , Publish Date - May 21 , 2026 | 05:30 AM

‘ఏ ప్రభుత్వానికైనా తమ పరిధిలో ఎంత మంది వెనుకబడిన తరగతుల ప్రజలు (బీసీలు) ఉన్నారో తెలిసి ఉండాలి. అప్పుడే వారి కోసం ఎలాంటి సంక్షేమ చర్యలు...

బీసీలు ఎంత మంది ఉన్నారో తెలియాలి!

ప్రభుత్వాలకు అది అవసరం

ఆ వివరాలు ఉంటేనే బీసీల సంక్షేమానికి నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది

కులగణన విధానపరమైన నిర్ణయం

మేం జోక్యం చేసుకోం: సుప్రీంకోర్టు

జనగణనలో కులాల వారీగా వివరాల సేకరణ వద్దంటూ దాఖలైన పిల్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): ‘ఏ ప్రభుత్వానికైనా తమ పరిధిలో ఎంత మంది వెనుకబడిన తరగతుల ప్రజలు (బీసీలు) ఉన్నారో తెలిసి ఉండాలి. అప్పుడే వారి కోసం ఎలాంటి సంక్షేమ చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించుకోగలుగుతుంది’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. జనగణనలో కులాల వారీగా కూడా వివరాలు సేకరించాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని తప్పుబడుతూ.. కులగణనను నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గత ఏడాది సెప్టెంబరు 3వ తేదీన సుధాకర్‌ గుమ్ముల సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై బుధవారం సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ స్వయంగా వాదనలు వినిపించేందుకు అభ్యర్థించగా ధర్మాసనం అగీకరించింది. జనగణనలో కులగణన అవసరం లేదని, ఇప్పటికే ప్రభుత్వం వద్ద తగినంత సమాచారం అందుబాటులో ఉందని సుధాకర్‌ పేర్కొన్నారు. కుల పరమైన వివరాలు సేకరిస్తే అవి దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా ఈ డేటా కార్పొరేట్‌ సంస్థలు, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళితే ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు. ఈ వాదనలపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘జనాభా లెక్కలు కుల ప్రాతిపదికన జరగాలా? వద్దా? అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన అంశం. తమ పరిధిలో బీసీలు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. అప్పుడే వారి కోసం ఎలాంటి సంక్షేమ చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించుకోగలుగుతుంది’ అని స్పష్టం చేశారు. విధానపరమైన ప్రభుత్వ నిర్ణయాల్లో తాము కలగజేసుకోబోమని చెప్తూ వ్యాజ్యాన్ని కొట్టేశారు.

ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 21 , 2026 | 05:30 AM