Share News

ఇష్టం లేకుండా గర్భం కొనసాగించాలని ఒత్తిడి చేయలేం... సుప్రీంకోర్టు తీర్పు

ABN , Publish Date - Feb 06 , 2026 | 06:26 PM

మైనర్‌గా ఉన్నప్పుడు గర్భవతి అయిన ఒక అమ్మాయి 30 వారాల గర్భాన్ని తొలగించేందుకు అత్యున్నత న్యాయస్థానం శుక్రవారంనాడు అనుమతించింది.

ఇష్టం లేకుండా గర్భం కొనసాగించాలని ఒత్తిడి చేయలేం... సుప్రీంకోర్టు తీర్పు
Supreme Court

న్యూఢిల్లీ: సంతానోత్పత్తికి సంబంధించి మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు (Reproductive Autonomy)ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఇష్టం లేకుండా గర్భం కొనసాగించాలని ఏ మహిళను ఒత్తిడి చేయలేమని స్పష్టం చేసింది. మైనర్‌గా ఉన్నప్పుడు గర్భవతైన ఓ యువతి 30 వారాల గర్భాన్ని తొలగించేందుకు అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం నాడు అనుమతించింది. గర్భ విచ్ఛితికి అనుమతిని నిరాకరిస్తూ ముంబై హైకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ బీవీ నాగర్నత సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.


మహారాష్ట్రకు చెందిన బాలిక తన బాయ్‌ఫ్రెండ్‌తో రిలేషన్ కారణంగా కొన్ని నెలల క్రితం గర్భవతైంది. అప్పటికి ఆమెకు 17 ఏళ్లు. ప్రస్తుతం 18 ఏళ్ల నాలుగు నెలలు. 30 వారాల గర్భిణి. అయితే గర్భాన్ని కొనసాగించాలని తాను కోరుకోవడం లేదంటూ ముంబై హైకోర్టును ఆమె ఆశ్రయించింది. అయితే ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం గడువు మించిపోయిందంటూ హైకోర్టు ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో ఆ బాలిక సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాలిక తరఫు న్యాయవాది కోర్టులో తన వాదన వినిపిస్తూ, ప్రెగ్నెన్సీని కొనసాగించాలని ఒత్తిడి చేస్తే సామాజిక కళంకం తలెత్తే అవకాశం ఉండవచ్చనే కారణంగా ఆమె మానసిక ఆందోళనకు గురికావచ్చన్నారు.


ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. గర్భవిచ్ఛితికి నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైనప్పటికీ అప్పీలుదారు హక్కును తప్పనిసరిగా పరిరక్షించాల్సి అంటుందని పేర్కొంది. ఆమె ఇష్టం లేకుండా గర్భాన్ని కొనసాగించాలనడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. గర్భవిచ్ఛితికి అనుమతించినా అమ్మాయికి ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది. యువతి నుంచి లిఖితపూర్వక అండర్‌టేకింగ్‌ తీసుకోవాలని, గర్భవిచ్ఛితికి వైద్యులను అనుమతిస్తున్నామని తీర్పు వెలువరించింది.


ఇవి కూడా చదవండి..

‘ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు.. పబ్లిసిటీ కావాలా’: సుప్రీంకోర్టు

దళపతి విజయ్‌కి షాక్ ఇచ్చిన కోర్టు.. ఆ పిటిషన్ కొట్టివేత

Updated Date - Feb 06 , 2026 | 07:45 PM