అప్పు ఇలా కూడా ఎగ్గొట్టొచ్చా..!
ABN , Publish Date - Aug 31 , 2026 | 05:39 AM
ఎస్సెల్ గ్రూపు వ్యవస్థాపకుడు సుభాష్‌చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో జరిగిన ఓటింగ్ వివాదం చర్చనీయాంశంగా మారింది. రూ.22 వేల కోట్లకుగాను గ్యారంటర్‌గా...
కుటుంబసభ్యులు, సన్నిహితుల కంపెనీలతో బ్యాంకులకు సుభాష్‌చంద్ర ఝలక్
ఎన్సీఎల్టీలో దివాలా ప్రక్రియకు అనుకూలంగా ఓటేసిన 5 కంపెనీలు వారివే..
ఆ కంపెనీలు ఆయనకు అసలు అప్పే ఇవ్వలేదు.. అవి కూడా సహ గ్యారంటర్లు
గతంలో సుభా్‌ష ఇచ్చిన నష్టపరిహార పత్రాలతో ఆ కంపెనీలూ ఎన్సీఎల్టీకి
22 వేల కోట్ల బకాయిలకుగాను.. రూ.6.5 కోట్లే చెల్లిస్తానంటూ
ఆయన చేసిన ప్రతిపాదనను ఆమోదించింది ఆ కంపెనీలే..
నిజంగా అప్పులిచ్చిన బ్యాంకులు, ఇతర రుణ సంస్థల తీవ్ర వ్యతిరేకత
ఎన్సీఎల్టీ తీర్పును అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో సవాల్ చేసేందుకు సిద్ధం
అంబానీ మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందన్న సుభాష్‌చంద్ర
‘ముకేశ్ నాకు పోయేదేం లేదు నీకే నష్టం’ అని హెచ్చరిక
సుభాష్‌చంద్ర చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలు కొట్టిపారేసిన రిలయన్స్
న్యూఢిల్లీ: ఎస్సెల్ గ్రూపు వ్యవస్థాపకుడు సుభాష్‌చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో జరిగిన ఓటింగ్ వివాదం చర్చనీయాంశంగా మారింది. రూ.22 వేల కోట్లకుగాను గ్యారంటర్‌గా రూ.6.5 కోట్లే చెల్లిస్తానంటూ సుభాష్‌చంద్ర చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన సంస్థల్లో ఐదు ఆయన కుటుంబానికి చెందినవేనని.. దాన్ని వ్యతిరేకిస్తున్న బ్యాంకులు అభ్యంతరం చెబుతున్నాయి. దివాలా నియమావళి ప్రకారం రుణం తీసుకున్న వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు/సంస్థలు.. రుణదాతల కమిటీ ఓటింగ్‌లో పాల్గొనకూడదు. కానీ, సుభా్‌షచంద్ర ప్రతిపాదనకు లభించిన 80.81ు ఓటింగ్ మద్దతులో 61.78ు ఓటింగ్ హక్కులు ఆయన కుటుంబసభ్యులకు లేదా ఎస్సెల్ గ్రూపునకు అత్యంత సన్నిహితమైనవని.. వాటికి ఓటింగ్ హక్కులు ఇవ్వడం చెల్లదని.. వ్యతిరేకిస్తున్న బ్యాంకులు వాదిస్తున్నాయి. ఆయన కుటుంబసభ్యులకు చెందిన కంపెనీలే రుణదాతలుగా ఎందుకున్నాయి? అవి కూడా అప్పు తీర్చాలంటూ ఎన్సీఎల్టీని ఎందుకు ఆశ్రయించాయి? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. దీన్ని ఒక ఉదాహరణతో అర్థమయ్యేలా చెప్పుకొందాం. సుబ్బారావు అనే పారిశ్రామికవేత్తకుచెందిన కొన్ని కంపెనీలు.. ఐదు బ్యాంకుల దగ్గర అప్పు తీసుకున్నాయి! ఆ అప్పులకు తాను పూచీకత్తు ఇస్తానని సుబ్బారావు ఆయా బ్యాంకులకు హామీ ఇచ్చాడు. ఆయనతోపాటు.. ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకుచెందిన ఐదు కంపెనీలు కూడా ఆ రుణాలకు పూచీకత్తుగా తమ షేర్లను బ్యాంకుల వద్ద తనఖా పెట్టాయి. అలా పెడుతూ.. ‘ సుబ్బారావ్,సుబ్బారావ్.. నీ కోసం మా షేర్లు బ్యాంకు వద్ద తనఖా పెడుతున్నాం కదా.. మరి రేపు ఏదన్నా జరగరానిది జరిగితే మా పరిస్థితి ఏమిటి?’ అని సుబ్బారావును ప్రశ్నించాయి. దీనికి ఆయన.. ఆ కంపెనీలకు కూడా వ్యక్తిగత గ్యారెంటీలు, లెటర్ ఆఫ్ ఇండెమ్నిటీలు ఇచ్చాడు. అంటే.. ‘‘భవిష్యత్తులో ఎప్పుడైనా నా వల్ల మీకు ఏదైనా నష్టం కలిగితే ఆ నష్టాన్ని వడ్డీతో సహా పూర్తిగా నా సొంత జేబు నుంచి భరించి, నిన్ను కాపాడుతాను’’ అని ఆ కంపెనీలతో అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నట్టన్నమాట. చట్టపరంగా చెల్లుబాటయ్యే ఒప్పందాలవి. కొన్నాళ్ల తర్వాత.. బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులను సుబ్బారావు కంపెనీలు తీర్చలేకపోయాయి. దీంతో ఆయా బ్యాంకులు.. తమ వద్ద తనఖాలో ఉన్న ఆ ఐదు కంపెనీల షేర్లను అమ్మేశాయి. కానీ, వాటి మార్కెట్ విలువ చాలా తక్కువగా ఉండడంతో వాటిని అమ్మడం ద్వారా వచ్చిన సొమ్ముతో పోలిస్తే.. బ్యాంకులకు రావాల్సిన బకాయిలే రూ.వేల కోట్లు ఉన్నాయి.
అప్పుడు బ్యాంకులు ఆ అప్పులకు వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చిన సుబ్బారావు మీద చర్యలకు దిగాయి. అందులో భాగంగా ఎన్‌సీఎల్‌టీ (నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్)కి వెళ్లాయి. అదే సమయంలో.. సుబ్బారావు తన కుటుంబసభ్యులకు చెందిన ఐదు కంపెనీలను కూడా రంగంలోకి దింపాడు. ‘నేను మీకు లెటర్ ఆఫ్ ఇండెమ్నిటీలు ఇచ్చా కదా.. వాటి ఆధారంగా మీరు కూడా నేను మీకు బకాయి పడ్డానని చెబుతూ ఎన్‌సీఎల్‌టీకి వెళ్లండి’ అని ఆ కంపెనీలకు చెప్పాడు. ఆ కంపెనీలు ఆయన చెప్పినట్టుగానే ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించి.. ‘సుబ్బారావు మాకు గతంలో ఇండెమ్నిటీ లెటర్లు ఇచ్చాడు. ఆయన వల్ల మేం నష్టపోయాం కాబట్టి.. మాకు కలిగిన నష్టాన్ని ఆయనే భరించాలి’ అని అభ్యర్థించాయి. గతంలో బ్యాంకుల వద్ద తనఖా పెట్టిన తమ షేర్ల మార్కెట్ విలువ (అది కూడా ప్రస్తుత విలువ కాదు.. తనఖా పెట్టిన నాటి విలువ కావాలని కోరాయి), 12 శాతం వడ్డీతో ఇప్పించాలని కోరాయి. అలా ఆ ఐదు కంపెనీలూ కలిసి చేసిన క్లెయిం, బ్యాంకుల క్లెయిం.. అంతా కలిపితే మొత్తం అప్పు రూ.22,006.57 కోట్లుగా తేలింది. అందులో 61.78ు అప్పు.. అంటే రూ.13,595.67 కోట్లు సుబ్బారావు కుటుంబసభ్యులు క్లెయిం చేసిన అప్పే. కానీ.. అది పేరుకే అప్పు. నిజమైన రుణం కాదు. ఆ కంపెనీల దగ్గర్నుంచీ సుబ్బారావు రూపాయి అప్పు తీసుకోలేదు. కానీ.. గతంలో వాటికి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెమ్నిటీ ప్రకారం చెల్లించాల్సిన మొత్తం అది. అంతే. ఈ దశలో సుబ్బారావు దీనంగా ఎన్‌సీఎల్‌టీ ముందుకు వెళ్లి ‘అసలు బ్యాంకులకు చెల్లించాల్సింది రూ.3,992 కోట్లు మాత్రమే. అందులో ఇప్పటికే రూ.620 కోట్లు.. అప్పు తీసుకున్న కంపెనీల ఆస్తులు, తనఖాలో ఉన్న షేర్ల అమ్మకం ద్వారా సెటిల్ అయ్యాయి. మరికొంత సొమ్మును ఆయా కంపెనీలు బ్యాంకులకు చెల్లించేలా నేను చూస్తా. ఇక, నేను పూచీకత్తుగా ఉన్నాను కాబట్టి.. నా బాధ్యతగా, నా మొత్తం ఆస్తుల నికర విలువ రూ.6.5 కోట్లు. అది చెల్లిస్తాను. అంతకుమించి నావల్ల కాదు’ అని వ్యక్తిగత దివాలా పిటిషన్ వేశాడు. అప్పుడు ఎన్‌సీఎల్‌టీ.. రుణదాతల కమిటీని ఏర్పాటు చేసి.. ‘ఇదుగో.. సుబ్బారావు రూ.6.5 కోట్లే ఇస్తానంటున్నాడు. మీకు ఓకేనా?’ అని అడిగింది. ఆ ప్రతిపాదనకు అనుకూలంగా 80.87ు ఓట్లు వచ్చాయి. అలా అన్నవి 8 కంపెనీలు. వాటిలోనూ ఐదు.. సుబ్బారావు కుటుంబ సభ్యులకు చెందినవే. అందుకే.. నిజంగా అప్పులిచ్చిన బ్యాంకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ.. ఎన్‌సీఎల్‌టీ సాంకేతిక కారణాలతో దీన్ని ఆమోదించింది. ఆ తీర్పును అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో అప్పీల్ చేస్తామని.. వ్యతిరేకిస్తున్న బ్యాంకులు చెబుతున్నాయి. ఈ ఉదాహరణలో.. సుబ్బారావు స్థానంలో సుభాష్ చంద్ర పేరు పెడితే అసలు విషయం అర్థమవుతుంది.
ఎంత దగ్గరంటే..
సుభాష్ చంద్ర చెల్లింపు ప్రతిపాదనను ఆమోదించిన ఆయన కుటుంబసభ్యుల ఐదు కంపెనీలు.. వీణాఇన్వె్‌స్టమెంట్స్, డైరెక్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ వెంచర్స్, వరల్డ్ క్రెస్ట్ అడ్వైజర్, లెమనేడ్ క్యాపిటల్ అడ్వైజర్, కార్ప్‌కాల్ క్యాపిటల్ అడ్వైజర్స్. వీటిలో వీణా ఇన్వె్‌స్టమెంట్స్ సంస్థ సుభా్‌షచంద్ర సోదరుడైన జవహర్ గోయల్ భార్య సుశీలాదేవి పేరిట ఉంది. వరల్డ్ క్రెస్ట్ అడ్వైజర్స్‌లో వాటాదారు అయిన వసంత్ శర్మ.. గతంలో వీణా ఇన్వె్‌స్టమెంట్స్, ఎస్సెల్ గ్రూప్ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేశారు. లెమనేడ్ క్యాపిటల్ అడ్వైజర్స్ భాగస్వాములు రవీంద్ర పాష్తే, నరేశ్ ఇంగాలేలకు ఎస్సెల్ గ్రూప్ నెట్‌వర్క్‌తో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. కార్ప్‌కాల్ క్యాపిటల్ అడ్వైజర్స్ డైరెక్టర్లు కూడా గతంలో ఎస్సెల్ గ్రూప్‌లో కీలకమైన మేనేజ్‌మెంట్ వ్యక్తులుగా వ్యవహరించారు. డైరెక్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో 99.99ు వాటాలు ఎస్సెల్ గ్రూప్‌నకు చెందిన ‘ఎస్సెల్ కార్పొరేట్ రీసోర్సెస్’ కంపెనీవే. సుభాష్ చంద్ర చెల్లించాల్సిన మొత్తం రుణంలో ఈ ఐదు కంపెనీల వాటానే అత్యధికం (61.78ు).
అంబానీపై ఆగ్రహం..
ఈ కేసులో ముకేశ్ అంబానీకి చెందిన మీడియా తనపైన, తన గ్రూప్ పైన దుష్ప్రచారం చేస్తోందని సుభా్‌షచంద్ర మండిపడ్డారు. ఈ మేరకు ఆయన నేరుగా ముకేశ్ అంబానీని ప్రశ్నిస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ముకేశ్‌జీ దయచేసి నా మీద, నా గ్రూప్ మీద తప్పుడు ప్రచారాన్ని ఆపండి. మీరు ధీరూభాయ్ అంబానీ కుమారుడు. ఆయన్నుంచీ నేను చాలా నేర్చుకున్నాను. కానీ, మీరు ఆయన్నుంచి ఏమీ నేర్చుకోలేదనిపిస్తోంది’’ అని సుభాష్ చంద్ర ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.. ‘‘ఎన్‌సీఎల్‌టీ తీర్పు అమల్లోకి వచ్చాక నా వద్ద ఏమీ మిగల్లేదు. ఏమీ లేని సుభాష్ చంద్రలాంటి వ్యక్తిని మీరు ఎందుకు వేధిస్తున్నారు? ఎందుకు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు? నేను ఇప్పటికే పూర్తిగా నష్టపోయా. నాకిక కోల్పోవడానికి ఏమీ లేదు. మీకు పోగొట్టుకోవడానికి చాలా ఉంది’’ అని పేర్కొన్నారు. అంతటితో ఆపలేదు. ‘‘ప్రధాని నరేంద్రమోదీ లాంటి నాయకులు మీ నియంత్రణలో ఉన్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ లేకపోయినా మీరు ఇలా చేస్తున్నారంటే.. నేనిక ఏమీ చెప్పలేను. కోల్పోవడానికి ఇక ఏమీ లేని వ్యక్తితో మీరు పోరాటం ఎందుకు చేస్తున్నారు? ఈ పోరాటం మిమ్మల్నే బాగా దెబ్బతీస్తుంది. మీ వెనక కూడా చాలా లొసుగులు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అని హెచ్చరించారు. అయితే.. సుభాష్ చంద్రవి అన్నీ నిరాధార ఆరోపణలేనని రిలయన్స్ మీడియా కొట్టిపారేసింది. ఒక వ్యాపారవేత్తగా, ఆంత్రప్రెనర్‌గా సుభాష్ చంద్రపై తమకు ఎంతో గౌరవం ఉందని, ఆయనకు మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొంది. వీరి సంగతి ఇలా ఉండగా.. బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా.. ఎన్‌సీఎల్‌టీ తీర్పుపై వ్యంగ్యంగా స్పందించారు. ‘‘నా బాకీ రూ.6,023 కోట్లకుగాను బ్యాంకులు, ప్రభుత్వం ఏకంగా రూ.14,100 కోట్లు రికవరీ చేసుకున్నాయి. కానీ, పెద్ద రుణగ్రహీతలు మాత్రం అతి స్వల్ప శాతానికే రుణాలు సెటిల్ చేసుకుంటున్నారు. భారత రుణ న్యాయ పరిష్కారం ఇదేనేమో’ అంటూ ఎద్దేవా చేశారు. తన విషయంలో విరుచుకుపడే మీడియా దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు.
ఇవి కూడా చదవండి..
సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు
ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని
తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News