Share News

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ

ABN , Publish Date - Nov 07 , 2026 | 09:37 PM

భారత రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘట్టాల్లో ఒకటైన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడం తప్పేనని, ఆ నిర్ణయం పట్ల ఆమె కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేశారని వెల్లడించారు.

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ
Sonia Gandhi about Emergency

ఇంటర్నెట్ డెస్క్: భారత రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘట్టాల్లో ఒకటైన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడం తప్పేనని, ఆ నిర్ణయం పట్ల ఆమె కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేశారని వెల్లడించారు. తన ఆత్మకథ 'బిలాంగింగ్: ది జర్నీ ఆఫ్ లవ్'లో ఈ విషయాలను ప్రస్తావించినట్టు సోనియా తెలిపారు. బ్రిటన్‌కు చెందిన 'ది గార్డియన్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా గాంధీ ఈ విషయాలను వెల్లడించారు (Sonia Gandhi Emergency).


ఎమర్జెన్సీ విషయంలో ఇందిరా గాంధీ కుమారులు రాజీవ్, సంజయ్ గాంధీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, కుటుంబంలోనూ విభేదాలు తలెత్తాయని సోనియా వివరించారు. ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న నాయకురాలని, ఎమర్జెన్సీ అమలులో ఉన్న సమయంలో ఆమె కూడా సౌకర్యంగా లేరని, ఆ నిర్ణయం ఆమెను లోలోపల ఇబ్బంది పెట్టి ఉంటుందని సోనియా అభిప్రాయపడ్డారు. 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించారు. 1977 మార్చి వరకు దాదాపు 21 నెలల పాటు కొనసాగింది. ఈ సమయంలో పౌర హక్కులపై ఆంక్షలు విధించారు. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేశారు. పత్రికలపై సెన్సార్‌షిప్ అమలైంది. ఈ పరిణామాలను భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా పరిగణిస్తారు (Emergency 1975).

sonia2.jpg


ఎమర్జెన్సీ విధించాలనే నిర్ణయంపై ఇందిరా గాంధీ కుటుంబంలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సోనియా వెల్లడించారు. తన భర్త రాజీవ్ గాంధీ ఎమర్జెన్సీ విధించకుండా, తదుపరి ఎన్నికల వరకు వేచి చూడాలని తల్లి ఇందిరకు సూచించినట్లు చెప్పారు. అయితే ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మాత్రం ఎమర్జెన్సీ విధించాలనే నిర్ణయాన్ని బలంగా సమర్థించినట్లు సోనియా వివరించారు. ప్రతిపక్షాలను అడ్డుకోవాల్సిందేనని సంజయ్ భావించారని పేర్కొన్నారు. ఒక కుటుంబ విందు సందర్భంగా కూడా ఈ అంశంపై చర్చ జరిగిందని, అప్పట్లో సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇందిరా గాంధీ నిర్ణయంపై ప్రభావం చూపాయని సోనియా తన పుస్తకంలో వివరించినట్లు 'ది గార్డియన్' పేర్కొంది (Sonia Gandhi Memoir).


ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాలకు సంజయ్ గాంధీ ప్రభావం కూడా ఒక కారణమని సోనియా అభిప్రాయపడ్డారు. ఆయనను అదుపులో ఉంచి ఉంటే ఎమర్జెన్సీ సమయంలో దేశానికి జరిగిన నష్టంలో చాలా వరకు నివారించగలిగేవారమని తన పుస్తకంలో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీకి ఎలాంటి అధికారిక మంత్రి పదవి లేకపోయినా, ప్రభుత్వ వ్యవహారాలపై ఆయనకు గణనీయమైన ప్రభావం ఉండేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, ఢిల్లీలో మురికివాడల తొలగింపు వంటి చర్యలు తీవ్ర వివాదాలకు దారితీశాయి.


ఇవి కూడా చదవండి..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..


అమెరికా దాడుల భయం.. ఇరాన్‌లో అయోడిన్ మాత్రలు పంచుతున్నారా..

Updated Date - Nov 07 , 2026 | 09:46 PM