ఊరుని అమ్మకానికి పెట్టిన గ్రామస్థులు.. కారణం ఏంటో తెలిస్తే..
ABN , Publish Date - Sep 28 , 2026 | 07:28 PM
మహారాష్ట్రలోని సొలాపూర్ జిల్లాలో ఓ గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామాన్ని అమ్మేస్తున్నట్టు గ్రామస్థులు పోస్టర్లు ఏర్పాటు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని సొలాపూర్ జిల్లాలో ఓ గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామాన్ని అమ్మేస్తున్నట్టు గ్రామస్థులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. 25 ఏళ్లుగా సాగునీటి కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసేందుకు ఈ వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. సొలాపూర్ జిల్లాలోని మాఢా తాలూకాలో ఉన్న తుల్షి గ్రామానికి చెందిన ప్రజలు వినూత్న పద్ధతిలో నిరసన చేపట్టారు (Solapur village for sale).
సాగునీటి సమస్యతో ఇక్కడి రైతులు చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలోనే సీనా-మాఢా ఎత్తిపోతల సాగునీటి పథకం ఉంది. అయినప్పటికీ దాని ప్రయోజనం తమ గ్రామానికి అందడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఆ ప్రాజెక్టు 2000లో ప్రారంభమైనప్పటికీ తుల్షి మాత్రం సాగునీటి కోసం ఇప్పటికీ వర్షాలపైనే ఆధారపడుతోంది (Tulshi village Maharashtra).
తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చామని, ఆందోళనలు చేశామని గ్రామస్థులు చెబుతున్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాన్ని ఎవరైనా కొనాలనుకుంటే ముందుకు రావొచ్చని ఆ గ్రామ సర్పంచ్ ప్రకటించారు. ఈ ఏడాది తుల్షి పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత 45 రోజులుగా వర్షపాతం లేకపోవడంతో నీటి వనరులు ఎండిపోయాయి (Maharashtra farmers protest).
నీటి సమస్య పరిష్కారం కోసం గ్రామస్థులు వినాయక చవితి సందర్భంగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు (Solapur water crisis). తమ డిమాండ్లను పరిష్కరించకపోతే తీవ్ర చర్యలకు పాల్పడతామని అధికారులను హెచ్చరించారు. ఎన్నికలను బహిష్కరిస్తామని కూడా ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రాధాకృష్ణ పాటిల్ గ్రామస్థులతో మాట్లాడి ఆందోళనను విరమింప చేశారు.
ఇవి కూడా చదవండి..
టీఎంసీ పేరు, గుర్తు వివాదం.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక డెడ్‌లైన్..
పార్కింగ్ ఛార్జీలు డబుల్, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కొత్త ప్లాన్..