శుభాంశు శుక్లాకు అశోక చక్ర అవార్డు..
ABN , Publish Date - Jan 25 , 2026 | 09:09 PM
గత ఏడాది జూన్‌లో జరిగిన 'యాక్సియమ్-4' మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా 40 ఏళ్ల శుభాంశు శుక్లా రికార్డు నెలకొల్పారు. సుమారు 18 రోజులు అక్కడే ఉండి అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన కీలక ప్రయోగాలు చేశారు.
న్యూఢిల్లీ: భారతదేశ కీర్తిపతాకను అంతరిక్షంలో రెపరెపలాడించిన ఇస్రో వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubhanshu Shukla)కు దేశ అత్యున్నత పీస్‌టైమ్ గ్యాలెంటరీ అవార్డు 'అశోక చక్ర' (Ashoka Chakra)ను ప్రకటించారు. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈనెల 26న ఢిల్లీలో జరుగనున్న గణతంత్ర వేడుకల్లో ఈ అవార్డును శుక్లాకు ప్రదానం చేయనున్నారు.
గత ఏడాది జూన్‌లో జరిగిన 'యాక్సియమ్-4' మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా 40 ఏళ్ల శుభాంశు శుక్లా రికార్డు నెలకొల్పారు. సుమారు 18 రోజులు అక్కడే ఉండి అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన కీలక ప్రయోగాలు చేశారు. ఖగోళంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టం, మానవ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే అంశాలపై ఒక వీడియాను చిత్రీకరించడం, అంతిరక్షంలో మానవ వ్యోమగాముల పరిస్థితిపై అధ్యయనం వంటివి చేశారు. దీంతో అంతరిక్ష పరిశోధనలో చూపిన అసమాన ధైర్యసాహసాలకు గాను 'అశోక చక్ర' అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు.
అంతరిక్షంలో సాధించిన విజయాలతోపాటు అత్యంత అనుభవజ్ఞుడైన ఫైటర్ పైలట్ క్రెడిట్ కూడా శుక్లాకు ఉంది. 2,000 గంటల ఫ్లైయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆయనకు ఉంది. ఎస్‌యూ-30 ఎంకేఐ, మిగ్-21, మిగ్-29, జాగ్వార్, హాక్, డోర్నియర్ వంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆయన నడిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి వెళ్లినప్పుడు ఇస్రో కోసం ఏడు ప్రయోగాలు చేయడంతోపాటు 60 శాస్త్రీయ పరిశోధనలకు సపోర్ట్ ఇచ్చారు. ఈ ప్రయోగాల ఫలితాలు భారత్ సొంతంగా 2027లో చేపట్టనున్న గగనయాన్ ప్రయోగం విజయవంతానికి ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ముగ్గురికి 'కీర్తి చక్ర'
అశోక చక్రతో పాటు 3 కీర్తి చక్ర అవార్డులు, 13 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేన పతకం, 44 మందికి సేన, ఆరుగురికి నౌ సేన, ఇద్దరికి వాయిసేన పతకాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మేజర్ ఆర్ష్‌దీప్ సింగ్, నాయబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బా, గ్రూప్ కెప్టెన్ ప్రసాంత్ బాలకృష్ణన్ నాయర్‌లకు 'కీర్తి చక్ర' పురస్కారాలు లభించాయి.
ఇవి కూడా చదవండి..
త్వరలోనే మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి గణతంత్ర ప్రసంగం
ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్
Read Latest National News