ఆర్జేడీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తేజస్వి యాదవ్
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:53 PM
'నూతన యుగారంభం..ఆర్జేడీ జాతీయ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా తేజస్వి యాదవ్ నియమితులయ్యారు' అంటూ ఆర్జేడీ అధికారిక 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసింది.
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (RJD)కు ఇప్పుడు కొత్త చీఫ్ వచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejaswi Yadav)ను ఆర్జేడీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారంనాడు నియమించారు. 'నూతన యుగారంభం..ఆర్జేడీ జాతీయ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా తేజస్వి యాదవ్ నియమితులయ్యారు' అంటూ ఆర్జేడీ అధికారిక 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసింది.
ఆర్జేడీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఆదివారంనాడిక్కడ ప్రారంభమైంది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, పార్టీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తేజస్వి నియామకాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించింది. నియామక పత్రాన్ని తేజస్వికి లాలూ ప్రసాద్ అందజేశారు. లాలూ ప్రసాద్ చిన్నకుమారుడైన తేజస్వి మొదట్నించి లాలూ వారసుడిగా ప్రచారంలో ఉన్నారు. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ గత ఏడాది పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తాజాగా తేజస్వి కీలక నియామకంతో కుటుంబ వారసత్వాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లనున్నారు.
తేజస్వి యాదవ్ 2020లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీని తన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లారు. ఆ ఎన్నికల్లో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ నిలిచింది. ముఖ్యమంత్రి నితీశ్ కమార్‌తో కలిసి కొద్దికాలం అధికారాన్ని పంచుకున్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ మూడో స్థానానికి పడిపోయింది. బీజేపీ-జేడీయూ కూటమి మునుపెన్నడూ లేనంతగా బలపడింది. లాలూ యాదవ్ కుటుంబంలో కలహాలు తారాస్థాయికి చేరిన తరుణంలో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలను తేజస్వికి అప్పగించడం విశేషం.
తేజస్వి యాదవ్ 1989 నవంబర్ 9న గోపాల్‌గంజ్‌లో జన్మించారు. ఏడుగురు అక్కలు, ఒక అన్నగారు తర్వాత కుటుంబంలో చివరి సంతానం. తొలినాళ్లలో పాట్నాలో చదువుకున్నప్పటికీ ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి అక్కడి పబ్లిక్ స్కూలులో చదివారు. ఇంటర్ పూర్తి కాకుండానే చదవుకు స్వస్తి చెప్పారు. 2010లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో మహాఘట్‌బంధన్‌లో భాగంగా రఘోపూర్ నుంచి పోటీచేసి గెలిచారు. 26 ఏళ్లలోనే ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన యువనేతగా రికార్డు సృష్టించారు. 2017లో కూటమి నుంచి నితీశ్ కుమార్ వైదొలగడంతో తేజస్వి విపక్ష నేత పాత్ర పోషించారు. 2018లో ఆర్జేడీలో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు.
ఇవి కూడా చదవండి..
వయసు 18 ఏళ్లు నిండాక ఓటరుగా రిజిస్టర్ అవ్వండి.. యువతకు ప్రధాని మోదీ పిలుపు
గణతంత్ర దినోత్సవం..982 మంది పోలీసులకు అవార్డులు
Read Latest National News