రాహుల్ పిరికివాడు.. షకీల్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 25 , 2026 | 06:55 PM
రాహుల్ గాంధీని పిరికివాడుగా, అభద్రతా భావం కలిగిన వ్యక్తిగా షకీల్ అహ్మద్ అభివర్ణించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి 2025 నవంబర్‌లో రాజీనామా చేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి షకీల్ అహ్మద్ (Shakeel Ahmad) పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని పిరికివాడుగా (coward), అభద్రతా భావం కలిగిన వ్యక్తి (insecure)గా అభివర్ణించారు. నియంతృత్వ ధోరణిలో వ్యవరిస్తుంటారని, ప్రజాస్వామికవాది కాదని రాహుల్‌పై విమర్శలు గుప్పించారు.
'రాహుల్ గాంధీ పిరికివాడు, అభద్రతాభావం కలిగిన నేత. తనకంటే సీనియర్ల ముందు అతనికి బాస్ అనే భావన రాదు. అందుకే నియంతలా వ్యవహరిస్తుంటారు. ఆయనకు పబ్లిక్ సపోర్ట్ కూడా పెద్దగా లేదు' అని మీడియాతో మాట్లాడుతూ షకీల్ అహ్మద్ అన్నారు. 2019లో సొంత నియోజకవర్గమైన అమేథి నుంచి ఓటమి పాలయ్యారని, గాంధీ వ్యవహారశైలే అందుకు కారణమని కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన అహ్మద్ విమర్శించారు. బిహార్ నుంచి మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా అహ్మద్ పనిచేశారు. గత ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ కూటమితో కలిసి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో కేవలం ఆరు స్థానాల్లో గెలిచింది.
రాహుల్ వైఖరి తేటతెల్లమైంది: బీజేపీ
షకీల్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్పందించింది. రాహుల్ గాంధీ నైజాన్ని షకీల్ అహ్మద్ బయటపెట్టారని బీజేపీ జాతీయ ప్రతినిధి షెషజాద్ పూనావాలా వ్యాఖ్యానించింది. తాను ఎంతో సహనం కలిగిన వాడినని, ప్రజాస్వామ్య వాదిననీ రాహుల్ చెబుతుంటారని, అసలు నిజం ఇందుకు భిన్నమని ఎద్దేవా చేశారు. షకీల్ అహ్మద్ వీడియోను కూడా తన పోస్ట్‌కు ఆయన జతచేశారు.
ఇవి కూడా చదవండి..
తమిళనాడులో హిందీకి ఎప్పటికీ చోటుండదు.. ఎంకే స్టాలిన్
ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్
Read Latest National News