రాహుల్‌కు ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు.. శశిథరూర్
ABN , Publish Date - Feb 02 , 2026 | 09:06 PM
నరవణే రాసిన పుస్తకం ప్రచురితం కాలేదని ప్రభుత్వం అభ్యంతరం చెప్పడానికి బదులుగా రాహుల్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండాల్సి ఉందని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం అతిగా స్పందించిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) వ్యాఖ్యానించారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన పుస్తకం (ఇంకా ప్రచురితం కాలేదు)లోని విషయాలతో వచ్చిన ఒక ఆర్టికల్‌ను రాహుల్ తన ప్రసంగంలో ప్రస్తావిస్తుండగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం తలెత్తి సభ వాయిదా పడింది. అనంతరం మీడియా సమావేశంలో రాహుల్‌కు బాసటగా శశిథరూర్ స్పందించారు.
'తన ఆందోళనను బయటపెట్టే అవకాశం ఆయనకు (రాహుల్) ఎప్పుడూ రాలేదు' అని శశిథరూర్ పేర్కొన్నారు. ఆ కథనం బలగాలను కానీ సైనికులను కానీ తప్పుపట్టలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న, తీసుకోకుండా పోయిన కొన్ని అంశాలను మాత్రమే రాహుల్ గాంధీ ప్రస్తావించాలనుకున్నారని, దానికి ప్రభుత్వం అంత అతిగా స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. రాహుల్ లేవనెత్తాలనుకున్న అంశం గురించి ప్రజలకు తెలిసిందేనని, ఆయన ఓ మ్యాగజైన్‌లో ప్రచురితమైన కథనంగా ఆధారంగానే మాట్లాడారని వివరించారు. ఆ పుస్తకం ప్రచురితం కాలేదని ప్రభుత్వం అభ్యంతరం చెప్పడానికి బదులుగా ఆయనకు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండాల్సి ఉందని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.
'ప్రభుత్వం అతిగా స్పందించాల్సిన అవసరం లేదు. అది సభ వాయిదాకు దారితీసింది. చర్చ కొనసాగించి ఉంటే పార్లమెంటులో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రతిబింబించి ఉండేది. నిజాలు తప్పయితే నిజాలను సవరించాలి. కానీ నిజాలను ప్రసారం కాకుండా అడ్డుకోకూడదు' అని శశిథరూర్ వ్యాఖ్యానించారు.
నెహ్రూ హయాంలో..
పండిట్ జవహర్‌లా నెహ్రూ హయాంలో పార్లమెంటులో జరిగిన కీలక చర్చను ఈ సందర్భంగా శశిథరూర్ ప్రస్తావించారు. 1962లో చైనా-భారత్ యుద్ధం జరుగుతుండగా పార్లమెంటు సమావేశమైందని, ఒకవైపు యుద్ధం జరుగుతుండగా చర్చలను పొడిగించి మరీ నిర్వహించారని చెప్పారు. 'అప్పుడు ఎలాంటి విప్‌లు లేవు. ప్రభుత్వ ఎంపీలు సైతం ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నెహ్రూను సైతం విమర్శించగలిగే వారు' అని తెలిపారు. 1965, 1971 యుద్ధాల సమయంలోనూ పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి ఆ వివరాలను ఎంపీలతో పంచుకోవడం, దేశ ప్రజలను పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి..
అవి నా మాటలు కావు, మాజీ ఆర్మీ చీఫ్ చెప్పినవే.. రాహుల్
ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. రాజ్‌నాథ్, అమిత్‌షా అభ్యంతరం