మణిపూర్ సీఎం ఎన్నిక ప్రక్రియ షురూ.. కేంద్ర పరిశీలకుడిగా తరుణ్ చుగ్
ABN , Publish Date - Feb 02 , 2026 | 08:03 PM
మణిపూర్ ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. ఆ రాష్ట్రానికి కేంద్ర పరిశీలకునిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌ను నియమించింది.
న్యూఢిల్లీ: మణిపూర్ (Manipur) ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. ఆ రాష్ట్రానికి కేంద్ర పరిశీలకునిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ (Tarun Chugh)ను నియమించింది. మణిపూర్ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేత ఎన్నిక ప్రక్రియను స్వయంగా ఆయన పర్యవేక్షించనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయ ఇన్‌చార్జి అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తరుణ్ చుగ్ నియామకం గురించి తెలియజేశారు.
మణిపూర్‌లో రెండోసారి రాష్ట్రపతి పాలన ముగియనుండటంతో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేను పార్టీ అగ్రనాయకత్వం సోమవారంనాడు ఢిల్లీకి పిలిచింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్, అసెంబ్లీ స్పీకర్ సత్యబ్రత సింగ్, మాజీ మంత్రి వై ఖేమ్‌చంద్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ శారదాదేవ్ హస్తినకు చేరుకున్నారు.
మణిపూర్‌లో మైతీ, కుకీ తెగల మధ్య చెలరేగిన హింసాత్మక ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, వేలాది మంది నిరాశ్రయులైన నేపథ్యంలో తొలిసారి ఆ రాష్ట్రంలో 2025 ఫిబ్రవరి 13న ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత 2025 ఆగస్టులో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలనను పొడిగించారు.
సంఖ్యాబలం
మణిపూర్ అసెంబ్లీలోని 60 మంది సభ్యులకు గాను బీజేపీకి 37 మంది సభ్యుల బలం ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు గెలుచుకోగా, ఇటీవల జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు బీజేపీలో చేరారు. ఇతర పార్టీల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)కి ఆరుగురు, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు ఐదుగురు సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌కు ఐదుగురు, కుకీ పీపుల్స్ అలయెన్స్ (కేపీఏ)కు ఇద్దరు సభ్యులు ఉండగా, ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులు కూడా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఒక సీటు ఖాళీగా ఉంది.
ఇవి కూడా చదవండి..
అవి నా మాటలు కావు, మాజీ ఆర్మీ చీఫ్ చెప్పినవే.. రాహుల్
ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. రాజ్‌నాథ్, అమిత్‌షా అభ్యంతరం