షార్జాలో ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. 22 మంది భారతీయులు సురక్షితం
ABN , Publish Date - Oct 10 , 2026 | 08:15 AM
యూఏఈలోని షార్జా యాంకరేజ్ వద్ద MT GEM NO. 2 ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగినట్లు వెల్లడైంది. ఈ నౌకలో ఉన్న 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర నౌకాయాన శాఖ ప్రకటించింది.
Sharjah Oil Tanker Drone Attack: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని షార్జా యాంకరేజ్ వద్ద పనామా జెండా కలిగిన క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ 'MT GEM NO. 2' పై డ్రోన్ దాడి జరిగినట్లు వెల్లడైంది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న మొత్తం 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అధికారికంగా ప్రకటించారు.
అక్టోబర్ 9న ఈ ఘటన జరగగా, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. నావికుల భద్రత కోసం షిప్ మేనేజ్‌మెంట్ కంపెనీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగినప్పటికీ, నౌకలోని 22 మంది భారతీయులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.
షార్జా యాంకరేజ్ ప్రాంతం అరేబియా గల్ఫ్‌లో ఉండగా, ఇటీవలి కాలంలో గల్ఫ్ ప్రాంతంలో, నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుసగా డ్రోన్ దాడి ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సముద్ర మార్గంలో వాణిజ్య నౌకల భద్రత, నావికుల ప్రాణ రక్షణ కోసం భారత్ ఇటీవల లైబీరియాతో కలిసి ప్రారంభించిన'గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ (GoF on S4)' ద్వారా అంతర్జాతీయ సహకారాన్ని కోరుతోంది. వాణిజ్య నౌకలపై దాడులు తక్షణమే నిలిచిపోవాలని ఐరాస వేదికగా భారత్ గట్టిగా డిమాండ్ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
నోబెల్ దక్కలేదని ట్రంప్ అసహనం.. విజేత పిళ్లైపై విమర్శలు
జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..