Share News

శరద్ పవార్, ఏక్‌నాథ్ షిండే భేటీ.. ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర రాజకీయాలు..

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:12 PM

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమావేశమయ్యారు. అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.

శరద్ పవార్, ఏక్‌నాథ్ షిండే భేటీ.. ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర రాజకీయాలు..
Sharad Pawar and Eknath Shinde

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమావేశమయ్యారు. అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అధ్యక్షతన అసెంబ్లీ భవనంలో నేడు (గురువారం) క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏక్‌నాథ్ షిండే హాజరయ్యారు. అదే సమయంలో శరద్ పవార్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీలోని షిండే కార్యాలయానికి వెళ్లారు. పవార్ తన కార్యాలయంలో వేచి ఉన్నారని తెలియగానే షిండే క్యాబినెట్ సమావేశాన్ని మధ్యలోనే ముగించుకుని అక్కడికి వెళ్లారు.


పుష్పగుచ్ఛంతో పవార్‌కు స్వాగతం పలికిన షిండే అనంతరం ఆయనతో సుమారు 15 నిమిషాల పాటు కీలక అంశాలపై చర్చించారు. ఆ తర్వాత షిండే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, ఈ సమావేశంలో ఏం చర్చించారనే విషయం బయటకు రాలేదు. షిండే కార్యాలయం కూడా దీనిని కేవలం మర్యాదపూర్వక భేటీగానే పేర్కొంది. అయితే, డిప్యూటీ సీఎం వెళ్లిపోయిన తర్వాత కూడా పవార్ అదే కార్యాలయంలో తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. దీంతో ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలో చేరారు. ఈ పరిణామంతో మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)లో ఇప్పటికే ఒడిదుడుకులకు గురవుతోంది.


ఇదిలా ఉండగా శరద్ పవార్ పార్టీలోని ఓ వర్గం ఎన్డీఏలో చేరేందుకు ఆసక్తి చూపుతోందన్న ఊహాగానాలకు ఈ భేటీ మరింత ఊతమిచ్చింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ సమావేశంపై ఎన్‌సీపీ(ఎస్‌పీ) మిత్రపక్షమైన శివసేన (యూబీటీ) తీవ్ర విమర్శలు చేసింది. షిండే కార్యాలయాన్ని పవార్ ఎందుకు సందర్శించారని యూబీటీ నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. 'షిండేను ఆయన కార్యాలయంలో కలవాల్సిన అవసరం ఏమిటి? పవార్ తన పార్టీ నాయకులను కలవడానికి అసెంబ్లీలో వేరే చోటు లేదా?' అని రౌత్ ప్రశ్నించారు. ఈ చర్య ఎన్‌సీపీ(ఎస్‌పీ), శరద్ పవార్ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని ఆయన అన్నారు.


'శరద్ పవార్ నిస్సందేహంగా గొప్ప నాయకుడు. అత్యంత గౌరవనీయమైన వ్యక్తి. అయితే, మన ప్రభుత్వాన్ని కూల్చివేసిన ద్రోహి సమక్షంలో పార్టీ సమావేశం నిర్వహించడం ఆయన స్థాయిని దెబ్బతీస్తుంది' అని రౌత్ వ్యాఖ్యానించారు. షిండేను ద్రోహిగా పేర్కొన్న ఆ యూబీటీ నేత.. ఆయనతో పవార్ జరిపిన సమావేశం మిత్రపక్షాలన్నింటినీ ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంవీఏ మిత్రపక్షాలన్నీ ఏక్‌నాథ్ షిండేకు దూరంగా ఉండాలని సంజయ్ రౌత్ పిలుపునిచ్చారు.


ఇవీ చదవండి:

మెల్‌బోర్న్‌లో మోదీకి ఘన స్వాగతం.. మార్వెల్‌ స్టేడియం 'హౌస్‌ఫుల్‌'

అక్రమ భవనాలు, నిర్మాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Updated Date - Jul 09 , 2026 | 05:17 PM