Share News

పీఎంకే రామదాస్‌తో శశికళ పార్టీ పొత్తు

ABN , Publish Date - Mar 20 , 2026 | 09:35 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరో కొత్త పొత్తు తెరపైకి వచ్చింది. ఎన్నికల వేళ 'ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం' పార్టీని స్థాపించిన వీకే శశికళ తాజాగా ఎస్.రామదాస్ సారథ్యంలోని పాట్టాలి మక్కల్ కట్చితో పొత్తు పెట్టుకున్నారు.

పీఎంకే రామదాస్‌తో శశికళ పార్టీ పొత్తు
VK Sasikala, PMK S Ramadoss

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరో కొత్త పొత్తు తెరపైకి వచ్చింది. ఎన్నికల వేళ 'ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం' పార్టీని స్థాపించిన వీకే శశికళ (VK Sasikala) తాజాగా ఎస్.రామదాస్ (S. Ramadoss) సారథ్యంలోని పాట్టాలి మక్కల్ కట్చి (PMK)తో పొత్తు పెట్టుకున్నారు. తమ కూటమి తమిళనాడుతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నట్టు రెండు పార్టీలు సంయుక్తంగా శుక్రవారంనాడు ఒక ప్రకటన విడుదల చేశాయి.


'తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం, పీఎంకే కలిసి పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. తమిళనాడులోని దేశద్రోహ శక్తులకు ఉద్వాసన చెప్పి, ప్రజాసంక్షేమాన్ని, తమిళనాడు ఆత్మగౌరవాన్ని, స్వయం ప్రతిపత్తిని మెరుగుపరచేందుకు మేము కృషి చేస్తాం' అని ఆ ప్రకటనలో రెండు పార్టీలు పేర్కొన్నాయి.


రామదాస్‌ను కలిసిన శశికళ

పొత్తులపై చర్చల్లో భాగంగా ఎస్.రామదాస్‌ను శశికళ శుక్రవారం ఉదయం విల్లుపురంలో కలుసుకున్నారు. దీనికి ముందు టీవీకే నేత విజయ్‌తో రామదాస్, శశికళ మంతనాలు సాగించినట్టు వదంతులు వచ్చాయి. అయితే వీటిని టీవీకే తోసిపుచ్చింది. కాగా, ఎస్.రామదాస్ తనయుడు అన్బుమణి రామదాస్ కొద్దికాలం క్రితం అన్నాడీఎంకేతో అవగాహన కుదుర్చుకుని ఎన్డీయేలో చేరారు. తండ్రీకొడుకుల మధ్య విభేదాలు వచ్చాయనే వదంతుల నేపథ్యంలో ఎస్.రామదాస్, శశికళ మధ్య చర్చలు జరిగి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైంది.


త్రిముఖ పోటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. డీఎంకే సారథ్యంలోని కూటమి, అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీయే కూటమి మధ్య ప్రధాన పోటీ ఉందని అంచనా వేస్తుండగా, కొత్తగా విజయ్ టీవీకే సొంతంగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. దీంతో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఏప్రిల్ 29న ఒకే విడతలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

పుదుచ్చేరిలో ఎన్డీయే సీట్ల షేరింగ్ ఖరారు.. ఏఐఎన్‌ఆర్‌సీకి 16, బీజేపీకి 10 సీట్లు

టీఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన మమతా బెనర్జీ

Updated Date - Mar 20 , 2026 | 09:54 PM