ప్రధానితో నా బంధం రాజకీయాలకు అతీతమైంది: సామ్ పిట్రోడా
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:23 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన బంధం రాజకీయాలకు అతీతమైందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా అన్నారు. తాను ప్రధానికి ఎల్లప్పుడూ స్నేహితుడినని ఆయన తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన బంధం రాజకీయాలకు అతీతమైందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా అన్నారు. తాను ప్రధానికి ఎల్లప్పుడూ స్నేహితుడినని ఆయన తెలిపారు. ఇటీవల సామ్ పిట్రోడాకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ మోదీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. దీనిపై శామ్ స్పందించి.. ధన్యవాదాలు చెప్పారు. ఇరు నాయకులు ఒకరినొకరు ‘భాయ్’ అంటూ సంబోధించుకున్నారు. దీంతో ఈ రెండు పోస్టులూ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రధానితో తనకున్న అనుబంధం గురించి పలు విషయాలను సామ్ పిట్రోడా పంచుకున్నారు. పార్టీలు వేరైనా మోదీ, తాను మంచి మిత్రులమని ఆయన చెప్పారు.
వ్యక్తిగత సంబంధాలకు రాజకీయాలతో ముడిపెట్టకూడదని సామ్ పిట్రోడా వివరించారు. మానవ బంధాలను రాజకీయాల నుంచి వేరు చేసి చూడాలని ఆయన తెలిపారు. కాగా ప్రధానితో చేసిన సంభాషణ ఇంత చర్చనీయాంశంగా మారటం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పుకొచ్చారు. ఆ సంభాషణ కేవలం వ్యక్తిగతమైందని అన్నారు. మోదీతో తన స్నేహం రాజకీయాలకు అతీతమైందని వర్ణించారు.
నా ఫోన్ కూడా ట్యాప్ అయింది..
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల అంశంలో రాహుల్ గాంధీని సామ్ పిట్రోడా వెనకేసుకొచ్చారు. ఆ విషయం నిజమేనని, తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆరోపించారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్యాపింగ్ చేయరని పేర్కొన్నారు. ఆ పని ఎవరు చేస్తున్నారో తనకు తెలియదని వెల్లడించారు.
ఈ వార్తలూ చదవండి
ప్రధాని మోదీ అలా చేయరని అనుకుంటున్నా: సామ్ పిట్రోడాస
మోదీ ఫిలిప్పీన్స్ టూర్ ఖరారు.. రెండు కీలక సదస్సులకు హాజరుకానున్న ప్రధాని