Share News

మహిళా జర్నలిస్ట్ హత్య కేసు.. ఎనిమిదేళ్ల తర్వాత వీడిన మిస్టరీ

ABN , Publish Date - Feb 12 , 2026 | 05:19 PM

సల్మా అనే జర్నలిస్ట్ హత్య కేసులో ఎనిమిదేళ్ల తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మా హత్య కేసులో ఇటీవలే ప్రత్యక్ష సాక్షి కోర్టుకు హాజరై.. అసలు నిజాలను వెల్లడించింది.

మహిళా జర్నలిస్ట్ హత్య కేసు.. ఎనిమిదేళ్ల తర్వాత వీడిన మిస్టరీ
Salma Sultana case

ఛత్తీస్‌గఢ్‌, ఫిబ్రవరి12: సల్మా సుల్తానా అనే మహిళా జర్నలిస్ట్ హత్య కేసుకు సంబంధించిన మిస్టరీ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వీడింది. ఈ హత్యకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షి ఒకరు కోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. సల్మా ప్రియుడే ఆమెను అత్యంత దారుణంగా చంపేశాడని, ఆ తర్వాత మృతురాలికి ఇష్టమైన పాటను వింటూ ఆ రాత్రంతా గడిపాడని సదరు సాక్షి కోర్టుకు తెలిపింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కోర్బా నగరంలో 2018లో సల్మా సుల్తానా అనే జర్నలిస్ట్ హత్యకు గురైంది. అంతేకాక భవానీ దాబ్రీ సమీపంలో నిర్మాణంలో ఉన్న రోడ్డు కింద ఆమె మృతదేహాన్ని నిందితులు రహస్యంగా పూడ్చిపెట్టారు. దాదాపు ఐదేళ్ల తర్వాత 2023లో పోలీసులు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్(జీపీఆర్) సాయంతో సల్మా మృతదేహాన్ని గుర్తించారు. ఈ క్రమంలో రోడ్డు తవ్వగా.. ఆమె మృతదేహం బయటపడింది. డీఎన్ఏ పరీక్షలు ఆ మృతదేహం సల్మాగా నిర్ధారించాయి. దీంతో అప్పటివరకూ మిస్సింగ్ కేసుగా ఉన్నది కాస్తా హత్య కేసుగా మారింది.


ఈ క్రమంలో సల్మా హత్యను చూసిన కోమల్ సింగ్ అనే మహిళ కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చింది. సల్మాతో సహజీవనం చేసే మధుకర్ సాహు అనే వ్యక్తే.. ఆమెను దారుణంగా హత్య చేశాడని తెలిపింది. మధుకర్ జిమ్ ట్రైనర్ గా పని చేస్తున్నాడు. సల్మా, మధుర్ సహజీవనం చేస్తుండేవారు. ఇదే సమయంలో అనేక మంది యువతులు, మహిళల వ్యక్తిగత వీడియోలు తీసి బెదిరిస్తూ ఉండే వాడు మధుర్. ఈ విషయమై తరచూ సల్మా, మధుకర్ మధ్య గొడవలు జరుగుతుండేవి. అతడి నుంచి దూరంగా వెళ్లిపోయేందుకు సల్మా సిద్ధమైంది. ఈ క్రమంలోనే 2018 అక్టోబర్ లో వారిద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. మధుకర్.. సల్మాను బెడ్ పై పడేసి గొంతు కోశాడు.


మరో నిందితుడు కౌశల్ శ్రీవాస్.. సల్మా నోటిని దిండుతో నొక్కిపట్టాడు. తాను జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా... చంపేస్తామని బెదిరించినట్లు కోమల్ కోర్టు ముందు వెల్లడించింది. సల్మాను చంపిన తర్వాత మధుకర్ సాహు సిగరేట్ తాగుతూ.. ఆమెకు ఇష్టమైన హిందీ పాటను విన్నాడని ప్రత్యక్ష సాక్షి కోమల్ సింగ్ తెలిపింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీల్ సోన్వానీ కోర్టులో ఇప్పటికే 41మంది సాక్షులను విచారించారని, ఇంకా 10 మంది మిగిలి ఉన్నారని ధృవీకరించారు. మొత్తంగా దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన జర్నలిస్ట్ హత్యలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలూ చదవండి:

చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పోలీసులు.. వీడియో వైరల్

ట్రంప్ విధానాలపై తండ్రీకూతుళ్ల వాగ్వాదం.. యువతి దుర్మరణం

Updated Date - Feb 12 , 2026 | 05:45 PM