చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పోలీసులు.. వీడియో వైరల్
ABN , Publish Date - Feb 11 , 2026 | 10:02 PM
పోలీసులు పట్టపగలు డ్యూటీలో ఉన్నప్పుడే చోరీ చేసినట్టు ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది. యూపీలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రజల ఆస్తిపాస్తులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే దొంగలుగా మారిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. యూపీలో వెలుగు చూసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. పట్టపగలు యూనిఫామ్‌లో వచ్చిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఓ షోరూమ్‌లో ఐఫోన్ చోరీ చేసిన వైనం సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. వారిని సస్పెండ్ చేసినట్టు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు (Police Theft Viral Video).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, జాన్‌పూర్ జిల్లా లైన్ బజార్ ప్రాంతం జేసీ ఇంటర్‌సెక్షన్ వద్ద శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఆ ఇద్దరు కానిస్టేబుల్స్‌పై సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మొబైల్ షాపు ఓనర్ శివమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రోజు తమ షాపునకు యూనిఫామ్ ధరించిన ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి వెళ్లారని శివమ్ తెలిపారు. వారు వచ్చి వెళ్లాక ఒక ఫోన్ కనబడకపోవడంతో సీసీటీవీ ఫుటేజీని చెక్ చేసినట్టు వెల్లడించారు. వారే ఫోన్‌ను దొంగిలించినట్టు ఫుటేజీలో స్పష్టంగా కనిపించిందని అన్నారు. వారు ఎవరో నిర్ధారించుకునేందుకు ఎంక్వైరీ చేస్తే వారు నిజంగానే పోలీసులన్న విషయం తెలిసిందని చెప్పారు.
ఈ ఆధారాలతో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వెంటనే పోలీసులు శివమ్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిసింది. ఈ ఘటనపై సిటీ ఎస్పీ ఆయుష్ శ్రీవాత్సవ స్పందించారు. ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. వారిపై శాఖాపరమైన దర్యాప్తునకు కూడా ఆదేశించినట్టు తెలిపారు.
ఇవీ చదవండి
ట్రంప్ విధానాలపై తండ్రీకూతుళ్ల వాగ్వాదం.. యువతి దుర్మరణం
వధువును రాడ్డుతో కొట్టి చంపిన వరుడు.. పెళ్లికి గంట ముందు దారుణం