ట్రంప్ విధానాలపై తండ్రీకూతుళ్ల వాగ్వాదం.. యువతి దుర్మరణం
ABN , Publish Date - Feb 11 , 2026 | 07:43 PM
తండ్రీకూతుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం ఊహించని మలుపు తిరిగింది. కూతురి మరణానికి దారి తీసింది. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: తండ్రితో జరిగిన తీవ్రస్థాయి చర్చ ఊహించని విధంగా కూతురి మరణానికి దారి తీసిన అసాధారణ ఘటన అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. గతేడాది జనవరి 10న ఈ ఘటన జరిగింది. యువతి తండ్రికి వ్యతిరేకంగా తగిన ఆధారాలు లేకపోవడంతో అమెరికాలో క్రిమినల్ కేసు దాఖలు కాలేదు. అయితే, మృతురాలు బ్రిటన్ పౌరురాలు కావడంతో తాజాగా అక్కడ విచారణ జరిగింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, టెక్సాస్‌లో ఉంటున్న క్రిస్ హారిసన్‌ను చూసేందుకు ఆయన కూతురు లూసీ హారిసన్ వెళ్లిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. ట్రంప్ విధానాల విషయంలో తండ్రీకూతుళ్ల మధ్య భేదాభిప్రాయాలు ఉండేవి. ముఖ్యంగా గన్ను కలిగి ఉండటం తన హక్కు అని వాదించే క్రిస్‌తో కూతురు లూసీ నిత్యం విభేదించేది.
గతేడాది జనవరి 10న లూసీ బ్రిటన్‌కు తిరుగుప్రయాణమయ్యే ముందు కూడా తండ్రీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. వేధింపులు ఎదుర్కొన్న యువతుల్లో మీ కూతురు ఉండి ఉంటే ఎలా స్పందించేవారని లూసీ తండ్రిని ట్రంప్ విధానాల విషయంలో నిలదీసింది. ఇది తీవ్ర వాగ్వాదానికి దారి తీయడంతో లూసీ బాధపడుతూ పైగదిలోకి వెళ్లిపోయింది. అప్పటికే క్రిస్ తన కుటుంబం రక్షణ కోసమని చెప్పుకుని ఓ తుపాకీని తెచ్చి ఇంట్లో పెట్టారు. ఆ తరువాత కొన్ని క్షణాలకే తండ్రీకూతుళ్లన్న గదిలోంచి తుపాకీ పేలుడు శబ్దం వినిపించింది. ఇతర కుటుంబసభ్యులు వెళ్లి చూడగా కూతురు లూసీ విగత జీవిగా కనిపించింది.
తను కొత్తగా తెచ్చిన గన్‌ను కూతురికి చూపిస్తుండగా పొరపాటున పేలిందని క్రిస్ చెప్పుకొచ్చారు. క్రిస్‌కు వ్యతిరేకంగా తగిన ఆధారాలు లేవని అక్కడి గ్రాండ్ జ్యూరీ ఆయనపై క్రిమినల్ ఆరోపణలకు నిరాకరించింది. ఈ విషయమై తాజాగా బ్రిటన్‌లో జరిగిన విచారణలో లూసీ అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకుందని కరోనర్ తేల్చారు. తుపాకీతో క్రిస్ అంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి
వధువును రాడ్డుతో కొట్టి చంపిన వరుడు.. పెళ్లికి గంట ముందు దారుణం
వివాహేతర సంబంధం.. భర్త ముందే మహిళను హత్య చేసిన లవర్