Share News

తల్లిదండ్రులను చంపిన టెకీ! అమెరికా నుంచి వచ్చి..

ABN , Publish Date - Feb 12 , 2026 | 03:23 PM

డబ్బు కోసం తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉదంతం బెంగళూరులో వెలుగు చూసింది. నిందితుడిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

తల్లిదండ్రులను చంపిన టెకీ! అమెరికా నుంచి వచ్చి..
Bengaluru software engineer kills parents

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన ప్రాజెక్టులకు డబ్బు కోసం తల్లిదండ్రులను వేధించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చివరకు వారిని దారుణంగా హత్య చేశాడు. బుధవారం హెచ్ఏఎల్ టౌన్‌షిప్‌కు సమీపంలోని విజ్ఞాన్ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు రోహన్ చంద్ర భట్‌గా (33) గుర్తించారు. అతడి తండ్రి నవీన్ చంద్ర భట్ (60) నేవీలో కెప్టెన్‌గా చేసి రిటైర్ అయ్యారు. తల్లి శ్యామల డెంటిస్టు (55) (Bengaluru Techie Kills Parents).

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అవివాహితుడైన రోహన్ గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా అమెరికాలో పనిచేసేవాడు. మూడేళ్ల క్రితం భారత్‌కు తిరిగొచ్చాడు. ఆ తరువాత ఇక్కడే సొంతంగా పలు ప్రాజెక్టులు చేశాడు. తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని అనుకున్నాడు. అయితే, నిధుల సమీకరణలో రోహన్ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళనతో ఉండేవాడు. తన ప్రాజెక్టుల కోసం తల్లిదండ్రులను నిధులు సమకూర్చమనీ అడిగేవాడు. కానీ, తాము డబ్బులు ఇవ్వలేమని తల్లిదండ్రులు తేల్చి చెప్పారు.


ఈ విషయంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా రోహన్ తల్లిదండ్రులకు దూరంగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అప్పుడప్పుడూ తల్లిదండ్రుల వద్దకు వచ్చి గొడవ పడుతుండేవాడు.

బుధవారం కూడా వారి మధ్య డబ్బు విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ తరువాత నిందితుడు తల్లిదండ్రులపై కత్తితో దాడిచేశాడు. వారి ఇంట్లో అరుపులు విని చుట్టుపక్కల వారు వచ్చి చూడగా నవీన్, శ్యామల తీవ్రగాయాలతో కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

ఇక స్థానికంగా ఉండే ఓ మహిళా డాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో ఉంటున్న అతడి సోదరికి సమాచారం అందించారు. అసలు అమెరికాలో రోహన్ ఏం చేసేవాడో? భారత్‌కు ఎందుకు తిరిగొచ్చాడో? తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.


ఈ వార్తలూ చదవండి:

చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పోలీసులు.. వీడియో వైరల్

ట్రంప్ విధానాలపై తండ్రీకూతుళ్ల వాగ్వాదం.. యువతి దుర్మరణం

Updated Date - Feb 12 , 2026 | 03:28 PM