Share News

ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లా మారిన మన బ్రహ్మోస్ క్షిపణులు!

ABN , Publish Date - Jun 18 , 2026 | 07:27 PM

భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'బ్రహ్మోస్' సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను తమ సొంత సాయుధ దళాలలో చేర్చుకోవడానికి రష్యా అమితాసక్తి కనబరుస్తోంది. అంతేకాదు, ఈ బ్రహ్మోస్ క్షిపణులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లా మారాయి.

ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లా మారిన మన బ్రహ్మోస్ క్షిపణులు!
Russia Keen to Induct BrahMos Missile, India May Supply Systems: BrahMos Aerospace Chief

నాగపూర్, జూన్ 18: భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 'బ్రహ్మోస్' సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను తమ సొంత సాయుధ దళాలలో చేర్చుకోవడానికి రష్యా ఆసక్తిని కనబరుస్తోంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా ఈ క్షిపణుల ఉత్పత్తిని భారీగా పెంచడంపై ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని నాగపూర్‌లో సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ తయారు చేసిన 100వ స్వదేశీ బూస్టర్‌ను విజయవంతంగా ప్రారంభించిన సందర్భంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్ జైతీర్థ్ జోషి ఈ కీలక విషయాలను వెల్లడించారు.

రష్యాకు ఇప్పటికే బ్రహ్మోస్ ప్రాజెక్ట్‌తో అనుబంధం ఉన్న పారిశ్రామిక భాగస్వాములు, సొంత తయారీ కేంద్రాలు ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారికి క్షిపణుల అవసరం మరింత పెరిగింది. రష్యాలోని ప్రస్తుత తయారీ సౌకర్యాలు ఈ అదనపు డిమాండ్‌ను అందుకోవడానికి సరిపోకపోవచ్చని, అందుకే భారత రక్షణ పరిశ్రమ ఇందులో కీలక పాత్ర పోషించనుందని జోషి పేర్కొన్నారు. 'మేము రష్యాతో కలిసి పనిచేస్తాం, వారి అవసరాలకు తగ్గట్టుగా క్షిపణి వ్యవస్థలను భారతదేశం నుంచి సరఫరా చేస్తాం' అని ఆయన స్పష్టం చేశారు.

Brahmos-booster.jpg


'ఆపరేషన్ సిందూర్'తో అంతర్జాతీయ క్రేజ్:

గత 25 ఏళ్లుగా సాగిన నిరంతర పరిశోధనలు, పరీక్షలు, విజయవంతమైన మోహరింపుల వల్లే అంతర్జాతీయ మార్కెట్లో బ్రహ్మోస్‌కు ఈ స్థాయి నమ్మకం ఏర్పడిందని జోషి వివరించారు. ఈ సందర్భంగా, బ్రహ్మోస్ క్షిపణి సాధించిన ఘనతను ఆయన గుర్తుచేశారు. సాధారణంగా క్షిపణులను భూమిపై లేదా నౌకల నుంచి కృత్రిమ పద్ధతిలో పరీక్షిస్తారు. కానీ, 'ఆపరేషన్ సిందూర్' సమయంలో శత్రువులపై నేరుగా బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించి విజయవంతంగా పరీక్షించామని, ఇది ప్రపంచ రక్షణ రంగంలోనే ఒక మైలురాయి అని ఆయన అన్నారు. ఈ ఘనతే అంతర్జాతీయ కొనుగోలుదారులలో నమ్మకాన్ని రెట్టింపు చేసిందదని ఆయన చెప్పారు. బ్రహ్మోస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకులా మారిందని ఆయన అన్నారు.

వియత్నాం దేశానికి బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతికి సంబంధించిన చర్చలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయని కూడా జోషి వెల్లడించారు. కేవలం కొన్ని అధికారిక అనుమతులు మాత్రమే మిగిలి ఉన్నాయని, త్వరలోనే ఈ ఒప్పందం ఖరారు కానుందని బ్రహ్మోస్ చీఫ్ తెలిపారు. వియత్నాం మాత్రమే కాకుండా తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు చెందిన మరికొన్ని దేశాలతో కూడా ఎగుమతుల విషయమై చర్చలు నడుస్తున్నాయని ఆయన చెప్పారు.


ఇవి కూడా చదవండి..

కేబినెట్ భేటీలో రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

పంట గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 07:36 PM