గోశాలలోనే తరగతులు.. విద్యార్థులతో స్కూల్ పనులు..
ABN , Publish Date - Aug 20 , 2026 | 08:38 PM
చేతిలో పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్లాల్సిన చిన్నారులు.. అక్కడ చీపుర్లు పట్టుకున్నారు. ఓ ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో చిన్నారులకు గోశాలలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: చేతిలో పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్లాల్సిన చిన్నారులు.. అక్కడ చీపుర్లు పట్టుకున్నారు. ఓ ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో చిన్నారులకు గోశాలలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. జైపూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో చిన్నారులకు గోశాలలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులే ముందుగా ఆవరణను ఊడ్చి, చాపలు పరిచి, బల్లలు, కుర్చీలు సర్దుకుని తరగతులకు సిద్ధం చేస్తున్నారు. ఉపాధ్యాయులు వచ్చే వరకు పాఠశాల ఏర్పాట్లను పిల్లలే చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గోశాలలో తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కూడా లేకపోవడంతో విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతేడాది ఝలావార్ జిల్లాలోని పిపలోడిలో పాఠశాల పైకప్పు కూలి ఏడుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన తర్వాత రాజస్థాన్ హైకోర్టు పాఠశాల భవనాల భద్రతపై సుమోటోగా విచారణ చేపట్టింది. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో తరగతులు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏడాది గడిచినా జైపూర్‌లోని ఈ పాఠశాలకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ప్రస్తుతం గ్రామస్థుడు లాల్‌చంద్‌కు చెందిన గోశాలలో తరగతులు కొనసాగుతున్నాయి. ఇంతకాలం ఉచితంగా స్థలం ఇచ్చిన ఆయన.. ఇప్పుడు పశువుల కోసం స్థలం అవసరం కావడంతో పాఠశాలను ఖాళీ చేయాల్సి రావచ్చని చెబుతున్నారు.
రాజస్థాన్ విద్యాశాఖ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 63,018 పాఠశాలలు ఉండగా, 5,667 పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. వీటిలో 1,579 భవనాలను అధికారికంగా సురక్షితంగా లేవని గుర్తించారు. అలాగే 86,934 తరగతి గదులు శిథిలావస్థలో ఉండగా, 17,109 మరుగుదొడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో 29,093 మరుగుదొడ్లకు మరమ్మతులు అవసరమని అధికారులు గుర్తించారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల ప్రణాళికను హైకోర్టుకు సమర్పించింది. రాబోయే ఐదేళ్లలో రూ.12,335 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. ఇందులో కొత్త పాఠశాల భవనాలు, తరగతి గదులు, మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించనున్నారు.
ఇదిలా ఉంటే.. పాఠశాలల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని, ఫొటోలు, వీడియోల చిత్రీకరణను నిషేధిస్తూ విద్యాశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం వివాదానికి దారితీసింది. పాఠశాలల దుస్థితిని బయటకు రాకుండా చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇటీవల అల్వార్ జిల్లాలోని ఓ పాఠశాల పైకప్పు కూలిన ఘటనతో ఈ విమర్శలు మరింత తీవ్రతరమయ్యాయి. అయితే ప్రభుత్వం మాత్రం ప్రతి శాఖకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయని చెబుతోంది. పాఠశాల భవనాల భద్రత, చిన్నారుల ప్రాణరక్షణకు ప్రాధాన్యం ఇచ్చి శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి...
ఎస్‌సీబీఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక
సీఎం చంద్రబాబు ఆదర్శ పాలన అందిస్తున్నారు: ఎంపీ శ్రీభరత్
Read Latest AP News And Telugu News