Share News

కలిసి ఉంటేనే నిలబడతాం, విడిపోతే పడిపోతాం.. రాహుల్ గాంధీ

ABN , Publish Date - Jun 08 , 2026 | 08:32 PM

కలిసికట్టుగా ఉంటేనే నిలబడాతామని, విడిపోతే పడిపోతామని లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని భాగస్వామ్య పార్టీలు గుర్తెరిగి, ప్రధాన రాజకీయ ప్రత్యర్థిని నుంచి ఎదురయ్యే సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవలసిన అవసరం ఉందన్నారు.

కలిసి ఉంటేనే నిలబడతాం, విడిపోతే పడిపోతాం.. రాహుల్ గాంధీ
INDIA Bloc Meet

న్యూఢిల్లీ: కలిసికట్టుగా ఉంటేనే నిలబడతామని, విడిపోతే పడిపోతామని లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఈ విషయాన్ని భాగస్వామ్య పార్టీలు గుర్తెరిగి, ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవలసిన అవసరం ఉందన్నారు. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూట్‌ క్లబ్‌లో సోమవారంనాడు జరిగిన 'ఇండియా' కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ 15 నిమిషాల సేపు ప్రసంగించారు. కూటమి పార్టీలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించాలని అనుకోకుండా కలిసి కట్టుగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని, బీజేపీ నుంచి దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.


'ఓటు చోరీ' వంటి పలు అంశాల విషయంలో భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం లోపించడం, కూటమిలో భాగస్వామ్యం కలిగిన కొన్ని పార్టీలు కాంగ్రెస్‌పై తరచూ విమర్శలు చేస్తుండటంపై రాహుల్ గాంధీ అంసతృప్తి వ్యక్తం చేసారు. గత లోక్‌సభ ఎన్నికలను ప్రస్తావిస్తూ, బీజేపీని ఓడించడం కష్టమేమీ కాదని, అయితే అంతర్గత కుమ్ములాటతోనే మనకు మనం బలహీనమవుతున్నాయనే విషయాన్ని విపక్షాలు గుర్తించాలని సూచించారు.


2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సాధించినప్పటికీ ఆ తర్వాత జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో 240 సీట్లకే పరిమితమైంది. 2019లో 52 సీట్లు మాత్రమే సాధించిన కాంగ్రెస్ పార్టీ అనంతరం జరిగిన 2024 ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకుంది. ఇటీవల లోక్‌సభలో విపక్షాలన్నీ ఏకతాటిపై నిలబడటంతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విజన బిల్లు వీగిపోయింది.


నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జరిగిన సుమారు నెలరోజుల్లోనే 'ఇండియా' కూటమి తాజాగా ఢిల్లీలో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అస్సాం, బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించగా, కేరళలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. తమిళనాడులో టీవీకే విజయ్ విజేతగా నిలిచారు. పూర్తి మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల మద్దతుతో అధికారం చేపట్టారు. కాగా, మూడేళ్ల క్రితం జాతీయ స్థాయిలో ఏర్పడిన 'ఇండియా' కూటమి ఇకనుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని న్యూఢిల్లీ సమావేశంలో నిర్ణయించారు. తదుపరి సమావేశం వచ్చే ఆగస్టులో హైదరాబాద్‌లో జరుపుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా కూటమి నేతలు..

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ ఖర్గే..

Updated Date - Jun 08 , 2026 | 09:20 PM