Rahul Indor Water contamination: విషం సరఫరా చేస్తున్నారు.. ఇండోర్‌లో కలుషిత తాగునీటి మరణాలపై రాహుల్ నిప్పులు
ABN , Publish Date - Jan 02 , 2026 | 03:32 PM
భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటైన ఇండోర్‌లో తాగునీటి కాలుష్యం ఏమిటని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ నిలదీశారు. ఇండోర్‌లో నీరు లేదనీ, విషం మాత్రమే ఉందని నిప్పులు చెరిగారు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ (Indore)లో కలుషిత నీరు (Water Contamination) తాగి 10 మంది మృతి చెందడం, పెద్ద సంఖ్యలో జనం అనారోగ్యానికి గురికావడంపై కాంగ్రెస్ అగ్రనేత అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటైన ఇండోర్‌లో తాగునీటి కాలుష్యం ఏమిటని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇండోర్‌లో నీరు లేదనీ, విషం మాత్రమే ఉందని నిప్పులు చెరిగారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ప్రభుత్వం మాత్రం కుంభకర్ణుడిలా నిద్రపోతోందని ఆరోపించారు.
'ఇండోర్‌లో నీళ్లు లేవు, దానికి బదులుగా విషం సరఫరా చేస్తున్నారు. అధికార యంత్రాంగం కుంభకర్ణుడిలా నిద్రపోతోంది. ప్రతి ఇంట్లోనూ విషాదం నెలకొంది. పేదలు నిస్సహాయిలుగా ఉన్నారు. వారికి స్వాంతన కలించేందుకు బదులుగా బీజేపీ ప్రభుత్వం అహంకారపూరిత ప్రకటనలు చేస్తోంది' అని రాహుల్‌గాంధీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు.
మురికి, దుర్వాసన వచ్చే నీటి గురించి ప్రజలు పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ వారి ఫిర్యాదులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని రాహుల్ ప్రశ్నించారు. తాగునీటిలో మురుగునీరు ఎలా కలిసింది? సరఫరాను సకాలంలో ఎందుకు ఆపలేదు? బాధ్యులైన అధికారులు, నాయకులపై చర్చలు ఎప్పుడు తీసుకుంటారు? అని రాహుల్ వరుస ప్రశ్నలు సంధించారు. కలుషిత నీటి గురించి ప్రశ్నించిన మీడియాపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ విజయవర్గీయ అభ్యంతకర వ్యాఖ్యలు చేయడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. మధ్యప్రదేశ్ ఇప్పుడు దుష్టపరిపాలనకు కేంద్రంగా మారిందని అన్నారు. దగ్గు సిరప్ మరణాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలుకలు చిన్న పిల్లలను చంపడం, ఇప్పుడు మురుగునీటితో కలుషితమైన నీరు తాగడం వల్ల మరణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయన్నారు. పేదలు చనిపోయినప్పుడల్లా ప్రధాని మోదీ ఎప్పటిలాగే మౌనంగా ఉంటారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
ఇండోర్‌లో దారుణం.. తాగు నీరు కలుషితం కావడంతో 10 మంది మృతి
నిగ్గుతేల్చిన సర్వే.. ఈవీఎంల విశ్వసనీయతకు కర్ణాటక ప్రజలు పట్టం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి