రాహుల్ ఆరోపణలు తప్పుదోవ పట్టించేవే: ఈసీఐ ఫ్యాక్ట్‌చెక్
ABN , Publish Date - Oct 05 , 2026 | 08:41 PM
బిహార్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఫారమ్-6 మార్పులపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఈసీఐ ఘాటుగా స్పందించింది. ఫారమ్-6కు సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని, ఏకపక్షంగా మార్చారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ఈసీఐ ఫ్యాక్ట్‌చెక్ స్పష్టం చేసింది.
ఢిల్లీ: బిహార్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR)లో ఫారమ్-6 మార్పులపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు భారత ఎన్నికల సంఘం (ECI) ఘాటుగా స్పందించింది. ఫారమ్-6కు సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని, ఏకపక్షంగా మార్చారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ఈసీఐ ఫ్యాక్ట్‌చెక్ స్పష్టం చేసింది.
‘జ్ఞానేశ్ కుమార్ ఫారమ్-6ను చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా మార్చారన్న విషయం ఇప్పుడు ఎలాంటి సందేహానికీ తావులేకుండా నిర్ధారితమైంది’ అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి బీజేపీకి సహకరించేలా వ్యవహరించారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై జరిగిన ఈ ‘క్రిమినల్ అసాల్ట్’కు బాధ్యులైన వారందరినీ జవాబుదారీగా నిలబెడతామని రాహుల్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సమాధానంగా ఈసీఐ ఫ్యాక్ట్‌చెక్ ఎక్స్ వేదికగా కీలక వివరాలు వెల్లడించింది. రాహుల్ ప్రకటన తప్పుదోవ పట్టించే విధంగా ఉందని పేర్కొంది. బిహార్‌లో సర్ ప్రక్రియకు సంబంధించి 2025 జూన్ 24న జారీ చేసిన ఆదేశాలు ఎన్నికల సంఘంలోని కమిషన్ సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతోనే జారీ అయ్యాయని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు 2026 మే 27న ఇచ్చిన తీర్పులో సమర్థించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫారమ్-6కు సంబంధించిన నిబంధనలను ఎన్నికల సంఘం అధిపతి ఏకపక్షంగా లేదా చట్టవిరుద్ధంగా మార్చారన్న రాహుల్ ఆరోపణను ఈసీఐ తోసిపుచ్చింది.
మరోవైపు, బిహార్ సర్ సందర్భంగా ఫారమ్-6తో పాటు అదనపు డిక్లరేషన్‌ను జత చేయడంపైనా రాజకీయంగా వివాదం కొనసాగుతోంది. దీనిపైనా ఈసీఐ తన తాజా వివరణలో స్పష్టత ఇచ్చింది. 2026 సెప్టెంబర్ 26న విడుదల చేసిన ప్రెస్ నోట్ నంబర్ 120లోని పాయింట్ 1(iii)ను ఈసీఐ ప్రస్తావించింది. సర్ కోసం ఫారమ్-6కు జత చేసిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని తెలిపింది. ఈ అంశాన్నే తన ఫ్యాక్ట్‌చెక్‌లో ప్రధానంగా ప్రస్తావించిన ఈసీఐ.. ఫారమ్-6కు అదనపు డిక్లరేషన్‌ను చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా మార్చారన్న ఆరోపణలను ఖండించింది.
బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన సర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ వాగ్వాదం కొనసాగుతోంది. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓటర్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించేందుకే సర్ చేపట్టామని ఈసీఐ చెబుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
మేనల్లుడిని క్షమించిన మాయావతి.. మరోసారి బీఎస్పీ కన్వీనర్‌గా బాధ్యతలు
ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. బెస్ట్ డిపోలో 10 సీఎన్‌జీ బస్సులు దగ్ధం