Share News

ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి.. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై రాహుల్ డిమాండ్

ABN , Publish Date - May 16 , 2026 | 07:30 PM

సంచలనం సృష్టించిన 'నీట్' ప్రశ్నాపత్రం లీక్‌కు సంబంధించి కేంద్రంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ శనివారంనాడు విమర్శలు కొనసాగించారు. తక్షణం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి.. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై రాహుల్ డిమాండ్
Rahul Gandhi

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 'నీట్' (NEET) ప్రశ్నాపత్రం లీక్‌కు సంబంధించి కేంద్రంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారంనాడు విమర్శలు కొనసాగించారు. తక్షణం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో 22 లక్షల మంది నీట్ విద్యార్థులు నష్టపోయారని, అయినప్పటికీ ప్రధాని దీనిపై పెదవి విప్పడం లేదని విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణం తొలగిస్తారా? స్యయంగా ప్రధానమంత్రే ఇందుకు బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు. 'మోదీ జీ... ధర్మేంద్ర ప్రధాన్‌ను ఇప్పుడే తొలగించండి' అని ఆ ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు.


వైద్యకళాశాలల్లో అడ్మిషన్ల కోసం మే 3న నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ (అండర్‌గ్రాడ్యుయేట్) పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో దీనిని రద్దు చేశారు. దీంతో దేశంలోని నలుమూలల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. జూన్ 21 తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.


దీనిపై రాహుల్ విమర్శలు గుప్పిస్తూ, నీట్ పరీక్షల కోసం రెండేళ్ల పాటు 22 లక్షల మంది విద్యార్థులు రేయింబవళ్లూ కష్టపడ్డారని, వారి కఠోర శ్రమ బూడిదలో పోసిన పన్నీరయిందని అన్నారు. పరీక్షలకు రెండ్రోజుల ముందే నీట్ పేపర్ వాట్సాప్‌లో డిస్ట్రిబ్యూట్ అయిన విషయం యావద్దేశానికి తెలుసునని చెప్పారు. దీనితో తనకెలాంటి సంబంధం లేదని ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, యూనివర్శిటీ అధికారుల కుమ్మక్కు కావడం వల్లే విద్యావ్యవస్థకు తీవ్రనష్టం జరిగిందని ఆరోపించారు. ప్రతిభ ఆధారంగా కాకుండా సైద్ధాంతిక అనుబంధాల ఆధారంగానే వైస్ ఛాన్స్‌లర్ల నియామకాలు జరుగుతున్నాయని అన్నారు. వైస్ ఛాన్స్‌లర్ కావడానికి ఎలాంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం లేదని, ఆర్ఎస్ఎస్‌కు చెందిన వారైతే చాలని, ఈ విషయం యావద్దేశానికి తెలుసునని అన్నారు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ లేకుంటే ఎప్పటికీ వైస్‌ ఛాన్స్‌లర్లు కాలేరని అన్నారు. దేశంలో 80 సార్లు పేపర్ లీక్‌లు జరిగాయని, రెండు కోట్ల మంది యువత భవిష్యత్తు నాశనమైందని లెక్కలు చెప్పారు. పేపర్ లీకేజీలకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని మరోసారి డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

రూలర్స్ లా నుంచి రూల్ ఆఫ్ లా తెచ్చాం... సువేందు అధికారి

బొద్దింకల వ్యాఖ్యలపై వివరణ.. యువతను విమర్శించలేదన్న సీజేఐ

Updated Date - May 16 , 2026 | 07:35 PM