Share News

బొద్దింకల వ్యాఖ్యలపై వివరణ.. యువతను విమర్శించలేదన్న సీజేఐ

ABN , Publish Date - May 16 , 2026 | 05:36 PM

కొందరు యువత బొద్దింకల్లా తయారవుతున్నారని, వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. తన నోటి మాటలను ఒక వర్గం మీడియా వక్రీకరించిందని, దేశంలోని యువతను విమర్శించినట్టుగా తప్పుగా చిత్రీకరించిందని అన్నారు. తాను దేశ యువతను విమర్శించాననడం పూర్తిగా నిరాధారమని అన్నారు.

బొద్దింకల వ్యాఖ్యలపై వివరణ.. యువతను విమర్శించలేదన్న సీజేఐ
CJI Surya Kant

న్యూఢిల్లీ: ఎలాంటి ఉద్యోగాలు లభించని, ఏ వృత్తిని చేపట్టని కొందరు యువత బొద్దింకల్లా తయారవుతున్నారని, వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) వివరణ ఇచ్చారు. తన నోటి మాటలను ఒక వర్గం మీడియా వక్రీకరించిందని, దేశంలోని యువతను విమర్శించినట్టుగా తప్పుగా చిత్రీకరించిందని అన్నారు. తాను దేశ యువతను విమర్శించాననడం పూర్తిగా నిరాధారమని అన్నారు.


'ఏ మాత్రం హేతుబద్ధత లేని ఒక కేసు శుక్రవారంనాడు విచారణకు వచ్చినప్పుడు నేను వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఒక వర్గం మీడియా తప్పుగా ప్రచారం చేసింది. కొందరు బోగస్ డిగ్రీలతో లీగల్ వృత్తిలోకి వస్తున్న వారిని ఉద్దేశించి మాత్రమే నేను విమర్శించాను. అలాంటి వ్యక్తులు మీడియాలోకి, సామాజిక మాధ్యమాల్లోకి, ఇతర నోబెల్ ప్రొఫెషనల్‌లో చొరబడుతున్నారు. అలాంటి వారిని పరాన్నజీవులుగా అభివర్ణించాను. అంతే కానీ దేశంలోని యువతను విమర్శించినట్టు మీడియాలో కథనాలు రావడం పూర్తిగా నిరాధారం. ఆ వార్తలు నాకు బాధ కలిగించాయి' అని సీజేఐ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. దేశంలోని యువతను చూసి తాను గర్విస్తుంటానని, అభివృద్ధి చెందిన భారతదేశానికి యువత మూలస్తంభాలని సీజేఐ ప్రశంసించారు.


సీనియర్ అడ్వకేట్ హోదా కోరుతూ ఒక న్యాయవాది వేసిన పిటిషన్ సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ ధర్మాసనం ముందుకు శుక్రవారంనాడు విచారణకు వచ్చిన సందర్భంగా పిటిషనర్‌పై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొంతమంది పరాన్నజీవులు సమాజంలో ఉన్నారని, వారితో మీరు చేతులు కలుపుతారా అని ప్రశ్నించారు. ఫేస్‌‍బుక్‌లో పిటిషన్ వాడిన భాషను కూడా సీజేఐ ప్రస్తావించారు. ప్రపంచంలో అందరికీ సీనియర్ అడ్వకేట్ హోదా లభించినా, మీకు మాత్రం ఆ అర్హత దక్కదన్నారు. ఢిల్లీ హైకోర్టు మీకు ఆ హోదా ఇచ్చినా, వృత్తిపరమైన ప్రవర్తనను చూసి తాము దానిని రద్దు చేస్తామన్నారు. చాలామంది న్యాయవాదుల డిగ్రీల ప్రామాణికతపై తమకు అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో సీబీఐ విచారణ కోరాలని భావిస్తున్నట్టు చెప్పారు. దీంతో పిటిషనర్ క్షమాపణ చెప్పుకున్నారు. కేసు ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. అందుకు న్యాయస్థానం అనుమతించింది.


ఇవి కూడా చదవండి..

బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారు

సీఎం విజయ్, మంత్రులకు శాఖలను కేటాయిస్తూ లోక్ భవన్ ప్రకటన..

Updated Date - May 16 , 2026 | 06:14 PM