బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారు
ABN , Publish Date - May 16 , 2026 | 03:48 AM
ఎలాంటి ఉద్యోగాలూ లభించని, ఏ వృత్తిని చేపట్టని కొందరు యువత బొద్దింకల్లా తయారవుతున్నారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
కొందరు నిరుద్యోగులు సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తల్లా మారుతున్నారు
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం
న్యూఢిల్లీ, మే 15: ఎలాంటి ఉద్యోగాలూ లభించని, ఏ వృత్తిని చేపట్టని కొందరు యువత బొద్దింకల్లా తయారవుతున్నారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఆ యువత మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐతో పాటు ఇతర కార్యకర్తల్లా మారి వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభిస్తున్నారన్నారు. సీనియర్ అడ్వొకేట్ హోదా కోరుతూ ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌ను శుక్రవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌పై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొంత మంది పరాన్నజీవులు సమాజంలో ఉన్నారని, వారితో మీరు కూడా చేయి కలుపుతారా అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించారు. ప్రపంచంలో అందరికీ సీనియర్ అడ్వొకేట్ హోదా అర్హత లభించినా, మీకు మాత్రం ఆ అర్హత దక్కదు అంటూ తేల్చిచెప్పారు. ఒకవేళ ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ హోదా ఇచ్చినా, వృత్తిపరమైన ప్రవర్తన చూసి తాము దానిని రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. ఫేస్‌బుక్‌లో పిటిషనర్ వాడిన భాషను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. సీనియర్ అడ్వొకేట్ కోసం ప్రయత్నం చేసే వ్యక్తి ప్రవర్తన ఇలా ఉంటుందా అని ప్రశ్నించారు. చాలా మంది న్యాయవాదుల డిగ్రీల ప్రామాణికతపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఈ విషయంలో సీబీఐ విచారణ కోరాలని భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. కాగా, తన పిటిషన్ విషయంలో పిటిషనర్ కోర్టును క్షమాపణ కోరారు. పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించాలని వేడుకున్నారు. దీనిని అత్యున్నత న్యాయస్థానం అనుమతి తెలిపింది.