'ఛాత్రోన్ కీ గూంజ్' ప్రచారాన్ని వేగవంతం చేస్తున్న రాహుల్
ABN , Publish Date - Sep 10 , 2026 | 07:13 PM
దేశ విద్యా వ్యవస్థలోని లోపాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 'ఛాత్రోన్ కీ గూంజ్' ప్రచారాన్ని వేగవంతం చేశారు. సెప్టెంబర్ 19న ఇండోర్‌లో విద్యార్థులు, యువతతో ఆయన నేరుగా సమావేశం కానున్నారు.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 10: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 19న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 'ఛాత్రోన్ కీ గూంజ్' (Chhatron Ki Goonj) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
దేశ విద్యా వ్యవస్థలోని లోపాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు రాహుల్ గాంధీ ఈ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 19న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విద్యార్థులు, యువతతో ఆయన నేరుగా సమావేశం కానున్నారు.
సోషల్ మీడియా వేదికగా 'జెన్ జీ' (Gen Z) విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ, 'నా ప్రియమైన విద్యార్థులారా, యువతరమా.. దేశంలో దెబ్బతిన్న విద్యా వ్యవస్థ మీ ఆశల దివ్వెలను ఆర్పివేసి, భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తోంది' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ప్రతి విద్యార్థి స్వరం, వారి బాధలు, సూచనలు వినడం ఎంతో అవసరమని రాహుల్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ సమస్యలను, సలహాలను పంచుకోవడానికి ప్రత్యేక లింక్‌ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రచారం ప్రధానంగా పరీక్షల్లో అక్రమాలు, పరీక్షా పత్రాల (పేపర్) లీకేజీలు. నానాటికీ పెరుగుతున్న విద్యాలయాల ఫీజులు/అధిక ఖర్చులు.. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో ఆలస్యం, నిరుద్యోగం. తదితర అంశాలపై దృష్టి సారిస్తుంది.
గతంలో ఈ 'ఛాత్రోన్ కీ గూంజ్'(విద్యార్థుల గొంతు) కార్యక్రమాలు పూణే, కోటా, డెహ్రాడూన్, ప్రయాగ్‌రాజ్ నగరాల్లో ముగిశాయి. ఇప్పుడు ఐదవ నగరంగా ఇండోర్‌లో విద్యార్థుల సమస్యలను జాతీయ రాజకీయ వేదికపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ